టిక్కెట్ల పంపిణీ పై కాంగ్రెస్​ కసరత్తు.. త్వరలో ఢిల్లీకి నివేదిక

by Dishanational2 |
టిక్కెట్ల పంపిణీ పై కాంగ్రెస్​ కసరత్తు.. త్వరలో ఢిల్లీకి నివేదిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీ కాంగ్రెస్​పార్టీ టిక్కెట్ల పంపిణిపై కసరత్తు మొదలైంది. అసెంబ్లీ సెగ్మెంట్ ల వారీగా టీ పీసీసీ వివరాలు సేకరిస్తుంది. ఇన్​చార్జ్​లతో పాటు ఆశావహుల లిస్టును క్రోడీకరించి హైకమాండ్ కు పంపనుంది. ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్​సిగ్నల్​రాగానే టిక్కెట్ల ప్రకటన ఉంటుందని పార్టీ అధినాయకత్వం చెప్పుకొస్తుంది. అయితే గతంలో రాష్ట్ర కాంగ్రెస్​లీడర్లలో కొందరు సూచించినట్లు 50 శాతం సీట్లు ముందే ప్రకటించాలని కాంగ్రెస్​ఆలోచిస్తుంది. ఇందుకు టీపీసీసీ కూడా సమ్మతించినట్లు తెలిసింది. మిగతావి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రకటిస్తారు. టిక్కెట్ల పంపిణీలో జిల్లా అధ్యక్షులు, టీ పీసీసీ కమిటీలు, సమన్వయ, చేరికల కమిటీల ఆమోదం తర్వాతనే ఢిల్లీకి పంపించే జాబితాలోకి చేర్చుతామని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. ఇదిలా ఉండగా, స్వరాష్ట్రంలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ వివిధ కారణాలతో కాంగ్రెస్​టిక్కెట్లను ఆలస్యంగా ప్రకటించిందనే భావన పార్టీతో పాటు ప్రజల్లోనూ ఉంది. ఇదే తమకు నష్టం చేకూర్చిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు మరికొందరు నేతలు బహిరంగంగానే ప్రకటించారు. గతేడాది వరంగల్​లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ సమయంలోనూ టిక్కెట్లు ముందే ప్రకటించాలని కోమటిరెడ్డి నేరుగా రాహుల్ గాంధీనే కోరారు. ఢిల్లీ అధిష్టానం కూడా ఫోకస్​పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.

ఆచితూచి..

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​టిక్కెట్ల పంపిణీలో ఆచితూచి వ్యవహరించనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో పార్టీ ఇంటర్నల్​గా మూడు సర్వేలు చేయించింది. దీనిలో పార్టీ గెలుస్తుందని స్పష్టమైన ఇండికేషన్​వచ్చిందని స్వయంగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత ఏకంగా కాంగ్రెస్​ఓటు బ్యాంకు మరో ఐదు శాతం అదనంగా పెరిగిందనేది పార్టీ భావన. దీంతో ఆటోమెటిక్​గా టిక్కెట్ల ఆశించేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో పార్టీ టిక్కెట్ల పంపిణీపై సుదీర్ఘంగా ఆలోచిస్తుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వివిధ సమీకరణలతో పాటు బీఆర్ఎస్​అభ్యర్థిని బట్టి కూడా టిక్కెట్లను కేటాయించాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. అయితే గెలుపు గుర్రాలపై తమకు స్పష్టమైన సమాచారం, వాళ్ల పేర్లను మాత్రమే ఢిల్లీకి పంపించనున్నట్లు పార్టీ పేర్కొంది.

ముగ్గురికి 35 చొప్పున..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీ పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత మధుయాష్కీలకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరు 35 నియోజకవర్గాల్లో పర్యటించి, పాదయాత్రలు చేస్తూ జనాల నాడి పట్టుకోవాలని గతంలో హై కమాండ్ టాస్క్​ఇచ్చింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి యాత్ర పూర్తి, కాగా, భట్టి యాత్ర కొనసాగుతుంది. మధుయాష్కీ కూడా కొంత పూర్తి చేయగా, మిగతాది కూడా అతి త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ల ఆశిస్తున్న అభ్యర్థులపై ముగ్గరు నేతలకు స్పష్టమైన అవగాహన వచ్చింది. దీంతో ముగ్గురూ సమన్వయమై హై కమాండ్ కు టిక్కెట్ల జాబితాను పంపించే చాన్స్ ఉంది. అయితే కాంగ్రెస్​వేవ్​మొదలైన తరుణంలో టిక్కెట్ల కోసం పోటీ పడేవాళ్ల సంఖ్య భారీగా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఈసారి ఎన్​ఆర్ఐలు కూడా ఎక్కువగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.


Next Story

Most Viewed