టార్గెట్ సోమేశ్.. బీఆర్ఎస్ అనుకూల అధికారులపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్..!

by Disha Web Desk 14 |
టార్గెట్ సోమేశ్.. బీఆర్ఎస్ అనుకూల అధికారులపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండు నెలలు కావస్తోంది. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో ప్రభుత్వం భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల వరకు ఇటీవల బదీలీలు చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులపై పలు విమర్శలు చేసింది. బీఆర్ఎస్ సర్కార్‌కు తొత్తులుగా అధికారులు పనిచేశారని ఆరోపణలు చేసింది.

బీఆర్ఎస్ అనుకూల అధికారులపై సర్కార్ ఫోకస్

ప్రస్తుతం కొలువుదీరిని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కార్‌లో అవినీతి చేసిన అధికారులపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల అరవింద్ కుమార్ ఐఏఎస్‌కు సర్కార్ మెమోలు జారీ చేసింది. ఫార్ములా-ఈ సీజన్ 10 నిర్వహణ ఒప్పందంపై ప్రభుత్వం వివరణ కోరింది. ప్రభుత్వం అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏ నుంచి ఈ రేస్‌కు బదిలీ చేశారని అరవింద్ కుమార్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శి ఎస్.బాలకృష్ణ అరెస్టయ్యారు. ఏసీబీ నిర్వహించిన దాడుల్లో బాలకృష్ణకు సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల బయటపడ్డాయి. హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు హెచ్ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనల్ని ఆసరాగా చేసుకోని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌‌పై దృష్టి

గత ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్‌పై కాంగ్రెస్ దృష్టిపెట్టినట్లు సమాచారం. సోమేశ్ కుమార్ తన భార్య పేరు పై 25 ఎకరాల ఖరీదైన భూమి కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 249, 260లో 25 ఎకరాల భూమి కొనుగోలు చేశాడని, భూమి కొనుగోలు విషయంలో డీఓపీటీకి సోమేశ్ కుమార్ సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహరంలోనే ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు.



Next Story

Most Viewed