ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డికి ఉంది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డికి ఉంది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తనతో పాటు ముఖ్యమంత్రి అర్హత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజమైన పోరాట యోధుడు అని కొనియాడారు. తెలంగాణ కోసం తెగించి, సొంత పార్టీ ఎదురించి పోరాటం చేశారని.. కేసీఆర్ లాగా నకిలీ ఉద్యమం నడిపించలేదని అన్నారు. మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రం కావాలని కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ హైకమాండ్‌ను ఒప్పించారని అన్నారు.

తనతో పాటు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్ని కోమటిరెడ్డికి ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని భువనగిరి ఓటర్లను కోరారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు ఇచ్చినా అది మోడీ ఖాతాలోకే వెళ్తుందని చెప్పారు. మోడీతో, బీజేపీతో కేసీఆర్‌ ఏనాడూ పోరాటం చేయలేదని వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని అన్నారు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా సోదరులం చెరో భుజంగా ఉన్నామని అన్నారు.

రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి సోదరులు తోడైతే ఎవరూ తట్టుకోలేరు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో అప్పుల పాలైన తెలంగాణను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. భువనగిరి పార్లమెంట్ సీటును గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత నాదే అని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి చూసుకుంటారు.. గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని అన్నారు.

Read More...

నిరూపిస్తే నా పేరిట ఉన్న గడీని CM రేవంత్ రెడ్డికి రాసిస్తా.. రఘునందన్ రావు సవాల్



Next Story

Most Viewed