RS ప్రవీణ్ కుమార్‌కు గౌరవం తెచ్చిపెట్టింది అదే.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
RS ప్రవీణ్ కుమార్‌కు గౌరవం తెచ్చిపెట్టింది అదే.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగారని అన్నారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడి విడిగా ఉండేవని అన్నారు. కానీ, తాము దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చేరిపేయాలనుకుంటున్నామని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో శంకుస్థాపన చేశామని అన్నారు. చదువుమీద పెట్టేది ఖర్చు కాదని.. పెట్టుబడి అని అభిప్రాయపడ్డారు.

చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం వచ్చాయని అన్నారు. లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ బిల్లును ఆమోదించింది జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారీనే అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రమంతా మీరా కుమారిని ఎప్పుడూ గుర్తుచేసుకుంటుందని అన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. ఒకసారి దొరల చేతిలో ఉంటే.. ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుందని చెప్పారు. దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇవాళ అసెంబ్లీలో గడ్డం ప్రసాద్‌ను అధ్యక్షా అని పిలవాల్సిందే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు.. అసలు ఆ ప్రశ్నించే హక్కును, అధికారాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు.. చదువే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed