సీఎం రేవంత్ మనసంతా ఆ సీటుపైనే.. ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని భారీ స్కెచ్..!

by Disha Web Desk 19 |
సీఎం రేవంత్ మనసంతా ఆ సీటుపైనే.. ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని భారీ స్కెచ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనూ సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ మహబూబ్ నగర్ లోకసభ ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాస్త సమయం దొరికినా వెంటనే ఆ సెగ్మంట్‌లో పర్యటించి, కేడర్‌ను ఉత్సాహపరిస్తున్నారు. లీడర్లతో ప్రత్యేకంగా మీటింగ్స్ నిర్వహించి ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కసరత్తులు మొదలెట్టారు.

మహబూబ్ నగర్ సెగ్మెంట్‌లో టఫ్ ఫైట్..

రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలిచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి తెగ కష్టపడుతున్నారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ సీటును ఎలాగైనా గెలవాలని ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఒకవేళ అక్కడ ఫలితం తారుమారైతే రేవంత్ ఇమేజ్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. తన సొంత జిల్లా ఎంపీ సీటును గెలిపించుకోలేకపోయారని అపవాదు నిత్యం మోయాక తప్పదు. అదేసమయంలో సొంత పార్టీ లీడర్ల నుంచి సెటైర్లు, విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అది గమనించిన రేవంత్ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మరుసటి రోజు నుంచే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి విజయం కోసం ఫోకస్ పెట్టారు. ఆ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ బలాబలాలను అంచనా వేస్తూ ఇబ్బందులు ఉన్నచోట పార్టీని బూస్టప్ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈనెల రోజుల టైంలో రేవంత్ మహబూబ్ నగర్ సెగ్మెంట్‌లో 5 పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించారు. మూడు, నాలుగు సార్లు పార్టీ లీడర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

కొడంగల్‌పైనే ఆశలు..

బీజేపీ నుంచి పోటీ చేస్తోన్న డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకి గట్టిపోటీ ఇస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కొన్ని అసెంబ్లీ సెగ్మంట్లల్లో రెండు, మూడు వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ ముందంజలో ఉండే చాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీనితో కొడంగల్‌లో భారీ స్థాయిలో మెజార్టీ ఓట్లు సంపాదిస్తే, కాంగ్రెస్ అభ్యర్థి విజయం తథ్యమని రేవంత్ ప్లాన్ వేశారు. అందుకే ఆయన సమయం దొరికినపుడల్లా కొడంగల్‌లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి 50 వేల మెజార్టీని ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీకి చెందిన కీలక లీడర్లకు బాధ్యతలు అప్పగించి, ఆ సెగ్మంట్‌లో బీజేపీ ఉనికి లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలిసింది.

హామీలు, వరాలు..

మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో బోయలు, ముదిరాజ్‌లు అధిక సంఖ్యలో ఉన్నారు. వారికి దగ్గరయ్యేందుకు హామీలు ఇస్తున్నారు. వాల్మీమి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కావాల్సిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. అలాగే ముదిరాజ్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ వర్గానికి చెందిన నారాయణ పేట ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రిని చేస్తామని చెప్పారు. అదే విధంగా మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ది చేసేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొడంగల్–నారాయణ పేట ఎత్తిపోతల పథకానికి కావాల్సిన అనుమతులు, నిధులు మంజూరు చేశారు. ఆ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చారు.

అభ్యర్థి కంటే రేవంత్ కష్టమే ఎక్కువ..

ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి కంటే ఎక్కువగా సీఎం రేవంత్ కష్టపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. టైం దొరికినపుడల్లా స్థానిక లీడర్లకు ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు టాక్. పార్టీ విజయం కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నట్టు తెలిసింది. బీజేపీ అభ్యర్థిని ఢీ కొట్టేందుకు ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం.రేవంత్ పనితీరును చూస్తోన్న పార్టీ లీడర్లు ‘పార్లమెంట్ ఎన్నికల్లో రేవంతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ఉంది’ అని కామెంట్ చేస్తున్నారు.

మహబూబ్ నగర్ సెగ్మంట్‌లో రేవంత్ మీటింగ్స్..

మార్చి 24 జూబ్లీహిల్స్ ఇంట్లో స్థానిక లీడర్లతో మీటింగ్

మార్చి 28 కొడంగల్ ఇంట్లో స్థానిక లీడర్లతో సమావేశం

మార్చి 29 గాంధీభవన్‌లో బోయి కుల పెద్దలతో మీటింగ్

ఎప్రిల్ 04 మహబూబ్ నగర్‌లో బహిరంగ సభ

08న కొడంగల్ పట్టణంలో పార్టీ లీడర్లతో మీటింగ్

15న నారాయణ పేటలో జనజాతర సభ

19న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సభ

23న కొడంగల్ సెగ్మంట్ లోని మద్దూర్ మండలంలో సభ



Next Story

Most Viewed