నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్ కీలక హామీ

by Disha Web Desk 2 |
నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్ కీలక హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి ఇచ్చే నిధులు, వనరులపై కేంద్రం ప్రోగ్రెసివ్‌గా వ్యవహరించాలని, కీలకమైన నీతి ఆయోగ్ కూడా సహకార ధోరణిని ప్రదర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను పెంచాలని, కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్ ప్రతినిధులను కోరారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కుమార్ బేరి, సభ్యులు విజయ కుమార్, డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, డైరెక్టర్ అభినేష్ డాష్, ముత్తు కుమార్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో సచివాలయంలో మంగళవారం భేటీ అయిన సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావించారు.

ఈ సమావేశంలో ఇరు వైపులా పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, సహకార సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల అభివృద్ధి, పాలసీల రూపకల్పనలో రాష్ట్రాల సూచనలు, గవర్నింగ్ కౌన్సిల్‌లో చర్చించాల్సిన అంశాలు తదితరాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు కీలక అంశాలపై వెంటనే దృష్టి పెట్టి సహకరించాల్సిందిగా నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్‌ను కోరారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి ఇచ్చే నిధుల కేటాయింపు పెరిగేలా చూడాలని కోరారు. ఆరోగ్యం, విద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులను కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 1800 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయించాలో చొరవ తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర సమగ్ర ప్రగతి, అభివృద్ధి అంశాలు, విధాన కార్యక్రమాలు, సహకారంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. సమర్థవంతమైన పాలనకు మార్గదర్శక సూత్రంగా కో-ఆపరేటివ్ ఫెడరలిజం ప్రాముఖ్యతపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో నీతి ఆయోగ్ కలిసి పనిచేసేందుకు అంగీకారం కుదిరింది. రాష్ట్రాభివృద్ధి, కీలక రంగాలకు సంబంధించి ప్రాధాన్యతలను, రాష్ట్ర అవసరాలను నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి సీఎం తీసుకురాగా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కేంద్రం నుంచి అందవలసిన న్యాయమైన కేటాయింపులపైనా ఇరు పక్షాల మధ్య చర్చ జరిగింది. వినూత్న పాలనా పద్ధతులు, విజయవంతమైన నమూనాలను పరస్పరం సహకరించుకునేలా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. స్థానిక సమస్యల పరిష్కారంలో మెరుగైన పద్ధతులను అవలంబించాలని నీతి ఆయోగ్ సూచించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్‌, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించాలని నీతి ఆయోగ్ సూచించింది. సోలార్ ఎనర్జీని వినియోగించుకోవడంపై రాష్ట్రానికి సహకారం ఉంటుందని స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర సామర్ధ్యాలను పటిష్టం చేయడానికిగాను స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ ఫర్మేషన్ (ఎస్ఐటీ) మెకానిజాన్ని రాష్ట్రలో ఏర్పాటు చేయడంపై పరస్పరం చర్చించుకున్నారు.

సబర్మతి తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ :

అంతర్జాతీయ అత్యుత్తమ స్థాయిలతో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం మోడల్‌లో గతంలో సబర్మతి రివర్ ఫ్రంట్, నమామి గంగే వంటి ప్రాజెక్టుల తరహాలో మూసీ రివర్ ఫ్రంట్‌‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సాంకేతిక సహకారం అందించాల్సిందిగా నీతి ఆయోగ్‌ను ముఖ్యమంత్రి కోరారు. మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్స్ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) ఏర్పాటుకూ సహకరించాలని కోరారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని, అందుకనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి కోరారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కలసి పనిచేయాలని నిర్ణయం జరిగింది.

నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనాలని, చర్చల్లో పాలు పంచుకోవాలని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రికి నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. గతంలో పాలకమండలి సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనకుండా గైర్హాజరయ్యారు. ఫలితంలేని ఈ సమావేశాల్ల పాల్గొనడం వృథా అని, పల్లీ బఠాణీలు తినడానికి తప్ప దేనికీ పనికిరావని వ్యాఖ్యానించి బహిష్కరిస్తున్నట్లు లేఖ కూడా రాశారు. ఇలాంటి సమయంలో నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం గమనార్హం. నిర్మాణాత్మక మద్దతు, సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed