మొనగాడివైతే ఒక్క సీటైనా గెలిచి చూపించు.. కేటీఆర్‌కు CM రేవంత్ సవాల్

by Disha Web Desk 2 |
మొనగాడివైతే ఒక్క సీటైనా గెలిచి చూపించు.. కేటీఆర్‌కు CM రేవంత్ సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘నువ్వు మొనగాడివైతే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా గెలిచి చూపించు. మీ అయ్య, నువ్వు, నీ కుటుంబం కలిసి ప్రయత్నించండి. మా కార్యకర్తలు నిటారుగా నిలబడి కొట్లాడుతారు. సీఎం, పీసీసీ చీఫ్​హోదాలో పార్లమెంట్ ఎన్నికలకు వస్తున్నా.. కాస్కో. బీఆర్ఎస్‌ను బండకేసి కొట్టుడే ఇక” అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం చేవెళ్లలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ‘జన జాతర’ సభలో సీఎం మాట్లాడారు. మనిషివా? మానవ రూపంలో మృగానివా? అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్‌ను పెంచుకునేందుకు తమకు ఎలాంటి యూట్యూబ్‌లు అవసరం లేదని, బీఆర్ఎస్ ట్యూబ్‌లు పగలకొట్టడమే తమ లక్ష్యమన్నారు. కార్యకర్తలంతా ఇదే పనిలో నిమగ్నం కాబోతున్నారన్నారు. మూడు, ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని మాట్లాడే బీఆర్ఎస్ నాయకులను ఊర్లలో వేప చెట్టుకు కట్టేసి లాగులు ఊడదీసి కొట్టాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఊపునే పార్లమెంట్ లోనూ చూపి మెజార్టీ సీట్లు గెలిచేలా కృషి చేయాలన్నారు.

కంటికి రెప్పలా.. రక్తాన్ని చెమటగా మార్చారు..

పదేళ్ల కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టారని, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆస్తులు ధ్వంసం చేసినా, ఆక్రమించినా అధికారం కోసం తమ కార్యకర్తలు నిటారుగా నిలబడి ఫైట్ చేశారన్నారు. రక్తాన్ని చెమటగా మార్చి పవర్‌ను తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ జెండా మోసిన బుజాల రుణాలు తీర్చుకొని సందర్భం తమకు వచ్చిందన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. వాళ్ల త్యాగంతోనే పవర్ లోకి వచ్చామని నొక్కి చెప్పారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు తాను స్వయంగా బాధ్యత తీసుకుంటానన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తనకు వచ్చిన కుర్చీ కార్యకర్తల శ్రమతోనే వచ్చిందన్నారు. త్వరలోనే ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో సామాజిక వర్గాలు వారీగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామన్నారు.

Next Story

Most Viewed