యూసీసీ బిల్లుపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 19 |
యూసీసీ బిల్లుపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఉమ్మడి పౌరస్మృతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెడితే మద్దతు ఇవ్వబోమని, వ్యతిరేకంగానే ఓటు వేస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, ఆదివాసీలు, వివిధ మతాలు, జాతులు, ప్రాంతాలు ఉన్నాయని, వీరందరి మధ్య ఐక్యతను చీల్చేందుకే ఈ బిల్లు దోహదపడుతుందని, అందువల్లనే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అద్యక్షుడు, ప్రతినిధులతో సోమవారం సాయంత్రం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కేసీఆర్ పై వైఖరిని వెల్లడించారు. ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరిస్తామని క్లారిటీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న ఉమ్మడి పౌర స్మృతి నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని, ప్రజలను రెచ్చగొట్టి అవసరం లేని గొడవలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ధోరణి స్పష్టమవుతున్నదని కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా తొమ్మిదేండ్లుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. దేశంలో వేరే పనులేమీ లేవన్నట్టు ప్రజల మధ్య చీలిక తెచ్చి పొలిటికల్ మైలేజ్ పొందాలనుకుంటున్నదన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని, భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలుస్తామన్నారు.

పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్దం చేసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కేశవరావు, నామా నాగేశ్వర్‌రావులను కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టిన బీజేపీ ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి పేరుతో ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వ విధానంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన దేశ ప్రజల మధ్య ఐక్యను చీల్చడమే ఈ బిల్లు వెనక ఉద్దేశమని ఆరోపించారు. ఈ దేశంలోని ప్రజల అస్థిత్వానికి, వారి తరతరాల సాంప్రదాయ సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు ఈ బిల్లు గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించి దేశ ఐక్యతకు పాటు పడతామన్నారు.

మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడాలని, దేశంలోని గంగ జమునా తహజీబ్‌ను రక్షించేందుకు ముందుకు రావాలని తాము చేసిన రిక్వెస్టుకు సానుకూలంగా స్పందించినందుకు కేసీఆర్‌కు ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story