CM KCR Bihar Tour: రేపు బిహార్‌కు సీఎం కేసీఆర్?

by Disha Web Desk 4 |
CM KCR Likely to Visit Bihar On August 13
X

దిశ, తెలంగాణ బ్యూరో: CM KCR Likely to Visit Bihar On August 13| ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు బిహార్‌లో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం వెళ్ళి ఆ రాత్రికి అక్కడే బస చేసే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రానికి తిరుగు ప్రయాణం కానున్నట్లు అనధికారవర్గాల సమాచారం. రెండు రోజుల పాటు జరిగే ఈ టూర్‌లో సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఆర్మీలో పనిచేసి అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున చెక్కుల రూపంలో ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఇంతకాలం బీజేపీతో పొత్తులో ఉండి ప్రభుత్వాన్ని నడిపిన సీఎం నితీష్ కుమార్ మూడు రోజుల క్రితం ఆర్జేడీకి దగ్గరయ్యారు.

బీజేపీతో నితీష్ కుమార్ సంబంధాలు తెంచుకుని ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అక్కడకు వెళ్ళి వారిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు బిహార్ నుంచే తన జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ప్రయత్నాలను ప్రారంభించనున్నారు. గతంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ-జేడీయూ మధ్య బంధం తెగిపోయిన తర్వాత బిహార్ వెళ్ళి నితీష్, తేజస్విలతో భేటీకి ప్రయత్నిస్తుండడం గమనార్హం.

అమర జవాన్ల కుటుంబాలకు తలా రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమంతో పాటు రాజకీయ చర్చలే బిహార్ టూర్‌లో కీలకమైనదిగా టీఆర్ఎస్ వర్గాల సమాచారం. కేసీఆర్ బిహార్ పర్యటనపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి అఫీషియల్ షెడ్యూలు విడుదల కాలేదు. తొలుత ఈ నెల 14న వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించే షెడ్యూలు ఖరారైంది. కానీ బిహార్ పర్యటన కారణంగానే దీన్ని 16వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా పార్టీ నాయకులు సూచనప్రాయంగా తెలిపారు. బిహార్ పర్యటన తర్వాత రాష్ట్ర, జాతీయ రాజకీయ ముఖచిత్రంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: దెబ్బతిన్న 17 మోటార్లు.. కాళేశ్వరం పరిస్థితి ఏంటి?


Next Story

Most Viewed