నూతన పార్లమెంట్ ఓపెనింగ్‌పై KCR సైలెంట్.. గులాబీ బాస్‌ది మౌనమా.. వ్యూహమా..?

by Disha Web Desk 19 |
నూతన పార్లమెంట్ ఓపెనింగ్‌పై KCR సైలెంట్.. గులాబీ బాస్‌ది మౌనమా.. వ్యూహమా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై బాయ్ కాట్ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ నెల 28న ప్రధాని చేతుల మీదుగా జరగబోయే న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్‌పై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించగా అదే దారిలో వెళ్లేందుకు మిగతా విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కాంగ్రెస్‌తో సహా 19 విపక్ష పార్టీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు ఉమ్మడిగా లేఖ విడుదల చేశాయి.

తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం ఇతర విపక్షాల మాదిరిగానే దూరంగా ఉండాలని నిర్ణయించారు. అయితే బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు చేయబోతున్నట్లు ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్ మాత్రం మౌనం వీడకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయంలో ఇతర పార్టీల తమ నిర్ణయాన్ని ప్రకటించగా.. కేసీఆర్ మాత్రం తమ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయలేదు. దీంతో కేసీఆర్ మౌనంపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

విపక్షాల బాటలోనే కేసీఆర్..?

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ రాజకీయాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మరింత కఠినంగా మారాయనే చర్చ జరుగుతోంది. ఈ ఫలితాలతో ఇన్నాళ్లు కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు కాంగ్రెస్‌తో సత్సంబంధాలకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇన్నాళ్లు బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్.. నేషనల్ పాలిటిక్స్‌లో ఏకాకిగా మారుతున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో బీఆర్ఎస్ తమ నిర్ణయం వెళ్లడించేందుకు మరికాస్త సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

జరుగుతున్న ప్రచారం ప్రకారం విపక్షాల బాటలోనే కేసీఆర్ వెళ్తారనే చర్చ జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్ని ఓ వైపు ఉంటే బీఆర్ఎస్ మాత్రం మరో వైపు నిలిస్తే అది ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో కేసీఆర్ ఫైనల్ డిసిషన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది.

Next Story

Most Viewed