కోవిడ్​ తరువాత పెరిగిన పిల్లల అక్రమ రవాణా కేసులు

by Dishafeatures2 |
కోవిడ్​ తరువాత పెరిగిన పిల్లల అక్రమ రవాణా కేసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పకడ్భంధీ చట్టాలున్నాయి. వాటిని అమలు చేయటానికి అధికార యంత్రాంగాలు పని చేస్తున్నాయి. అయినా చిన్న పిల్లల అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కోవిడ్​ తరువాత ఈ కేసుల సంఖ్య శరవేగంగా పెరిగి పోతుండటం గమనార్హం. పద్మశ్రీ అవార్డు గ్రహీత కైలాష్​ సత్యార్థి స్థాపించిన కైలాష్​ సత్యార్థి చిల్ర్డన్స్ ఫౌండేషన్, ది గేమ్స్ 24X7 సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కోవిడ్​ ముందు సంవత్సరాలైన 2016 నుండి 2020తో పోలిస్తే 2021–2‌‌022 మధ్య తెలంగాణలో పిల్లల అక్రమ రవాణా కేసుల సంఖ్య రెండింతలు ఎక్కువగా నమోదయ్యాయి.

కాగా ఈ జాబితాలో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ర్టంలో కోవిడ్ కు ముందు సంవత్సరాలతో పోలిస్తే కోవిడ్​ తరువాతి సంవత్సరాల్లో 18 రెట్లు ఈ కేసుల సంఖ్య పెరిగినట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక టాప్ త్రీ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్​ ఉండటం గమనార్హం. జూలై 30న ప్రపంచ వ్యక్తుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ నివేదికలో 2016–2022 మధ్య దేశంలోని 21 రాష్ట్రాల్లోని 262 జిల్లాల్లో పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి కైలాష్​ సత్యార్థి చిల్డ్రన్​ ఫౌండేషన్, దాని భాగస్వామ్య సంస్థలు జోక్యం చేసుకున్న కేసుల డేటా ఆధారంగా గేమ్స్ 24x7 డేటా సైన్స్ బృందం ఈ గణాంకాలను వెల్లడించింది.

ఎక్కువగా హోటళ్లు, దాబాల్లో.. అక్రమ రవాణాకు గురవుతున్న పిల్లల్లో ఎక్కువ శాతం మంది హోటళ్లు, దాబాల్లో పని చేస్తున్నట్టు కైలాష్​ సత్యార్థి చిల్ర్డన్​స్ ఫౌండేషన్, గేమ్స్24x7 విశ్లేషణలో స్పష్టమైంది. వీటిల్లో పని చేస్తున్న బాలకార్మికుల శాతం 15.6గా వెల్లడైంది. ఇక ఆటోమొబైల్, రవాణా పరిశ్రమలో 13, గార్మెంట్ పరిశ్రమల్లో 11.18 శాతం మంది పిల్లలు పని చేస్తున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఎలక్ట్రానిక్, వస్ర్త కర్మగారాలు అత్యధిక సంఖ్యలో అక్రమ రవాణా ద్వారా తీసుకువచ్చిన పిల్లలను పనుల్లో పెట్టుకున్నాయి. ఆ తరువాత ఇటుక బట్టీలు, వ్యవసాయం, పాదరక్షల తయారీ వంటి రంగాలు ఉన్నాయి. గార్మెంట్ ఫాక్టరీల్లో చీరలకు రంగులు వేయటం, పాలిష్ చేయటం, స్పిన్నింగ్​ మిల్లు హెల్పర్, కుట్టుపని వంటివి పిల్లలతో చేయిస్తున్నారు.

ఇక ఎలక్ట్రానిక్ ఫాక్టరీల్లో బల్బులు, వైర్లను ప్యాక్​చేయటం వంటి పనులు చేయించుకుంటున్నారు. ఇతర కర్మాగారాలు వేర్వేరు పనుల కోసం మైనారిటీ తీరని యుక్త వయసు పిల్లలను పనుల్లో పెట్టుకుంటుంటే ఇటుకబట్టీలు, పైకప్పుల పలకల తయారీ యూనిట్లు 5 నుంచి 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలను కూడా పనుల్లో పెట్టుకుని చాకిరీ చేయిస్తున్నాయి. వివిధ సందర్భాల్లో రక్షించబడ్డ పిల్లల్లో 80శాతం మంది 13 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఉన్నారు. 13శాతం మంది పిల్లలు 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారున్నారు. ఇక, 9 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల శాతం 2గా ఉంది.

కృషి జరుగుతోంది..

దేశంలో పెరిగిపోతున్న పిల్లల అక్రమ రవాణా కేసులపై కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రిటైర్డ్ ​అడ్మిరల్​ రాహుల్ కుమార్ శావత్ మాట్లాడుతూ.. ఈ కేసుల నివారణకు దేశవ్యాప్తంగా జరుగుతున్న కృషి ప్రశంసనీయంగా ఉందన్నారు. ట్రాఫికర్లను పట్టుకోవటంలో, అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించటంలో రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఈ తరహా నేరాలను మరింత సమర్థవంతంగా నిరోధించాలంటే పార్లమెంట్​లో సమగ్రమైన అక్రమ రవాణా నిరోధక బిల్లును ప్రవేశ పెట్టాల్సిన అవసరముందన్నారు. ఈ సమావేశాల్లోనే ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

మరింత సాంకేతికతను వినియోగించాలి..

ఇక, గేమ్స్24x7 సహ వ్యవస్థాపకుడు, సీఈవో త్రివిక్రమన్​థంపీ మాట్లాడుతూ.. కైలాష్​సత్యార్థి చిల్డ్రన్ ​ఫౌండేషన్​కు ఆర్థిక సహాయాన్ని అందించటానికి మించి మైత్రిని విస్తరించటానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పిల్లలు అభ్యున్నతి కోసం శాశ్వత పరిష్కారాలను రూపొందించటానికి డేటా సైన్స్, అనలటిక్స్​ లో టెక్నాలజీ లీడర్​ గా అందించిన సమగ్ర నివేదిక ఇదని చెప్పారు. ఈ నివేదిక భవిష్యత్ మార్గదర్శకాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రతి బిడ్డ ఉజ్వల భవిష్యత్తే సురక్షితమైన రేపటిని సృష్టిస్తుందన్నారు.

Next Story

Most Viewed