యాచారం నుంచి నార్కట్ పల్లి వరకు కారవాన్–2

by Disha Web Desk 2 |
యాచారం నుంచి నార్కట్ పల్లి వరకు కారవాన్–2
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెరుగైన విధానాలు, చట్టాలు రూపొందాలన్నా, ప్రజాస్వామ్యం బలోపేతం కావాలన్నా, చట్టబద్ధపాలన ఉండాలన్నా ప్రజలను భాగస్వాములను చేయాలి. వారి అభిప్రాయాలు తెలుసుకోవడం అవసరం. ఈ క్రమంలోనే రైతులకు ఏం కావాలో తెలుసుకునేందుకు లీఫ్స్ అనే సంస్థ భూమి కారవాన్​–2 నిర్వహిస్తున్నది. ఈ నెల 17 నుంచి రంగారెడ్డి జిల్లా యాచారం నుంచి నల్లగొండ నార్కట్ పల్లి వరకు రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు కార్యాచరణను ప్రకటించింది. ప్రజలను చట్టాలు, విధానాల రూపకల్పనలో భాగస్వాములను చేయాలన్న సంకల్పంతో లీఫ్స్ బృందం ఆధ్వర్యంలో న్యాయవాదులు, రెవెన్యూ చట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు రైతులను స్వయంగా కలవనున్నారు. 2014 లో ఈ కారవాన్ లో భాగంగా 5 వేల మంది రైతులను కలిసి, వారి అభిప్రాయాల ఆధారంగా ‘తెలంగాణా ప్రజల భూమి మానిఫెస్టో’ని రూపొందించిన విషయం తెలిసిందే. 9 ఏండ్ల తర్వాత రైతుల స్థితిగతులు, భూమి హక్కుల్లో చిక్కులు, లాభం వంటి అంశాల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు.

ఇటీవల భూదాన్ పోచంపల్లి నుంచి కొండ మల్లెపల్లి వరకు పర్యటించారు. 112 కి.మీ. పర్యటించి పలువురు రైతులతో ముచ్చటించారు. రెండో యాత్రను సోమవారం పర్యటించనున్నట్లు లీఫ్స్ ఉపాధ్యక్షుడు జి.జీవన్ రెడ్డి, తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ దేశాయి కరుణాకర్ రెడ్డిలు చెప్పారు. రెండో యాత్రను ఈ నెల 17 న రంగారెడ్డి జిల్లా యాచారంలో ప్రారంభించి నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి వరకు 104 కి.మీ. చేపట్టామన్నారు. రైతులను కలిసి.. భూ సమస్యల పరిస్కారానికి, మరింత మెరుగైన భూపరిపాలన కోసం ప్రభుత్వం ఇంకా ఏం చెయ్యాలి?, సాగుకు సంబంధించి రైతుల న్యాయ అవసరాలు ఏమిటి?.. ఈ రెండు ప్రశ్నలకు అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. వీటి ఆధారంగానే మరోసారి తెలంగాణ ప్రజల భూమి మానిఫెస్టో ని రూపొందిస్తామన్నారు. రైతుల న్యాయ అవసరాలపై నివేదిక తయారు చేస్తామని ప్రకటించారు. యాత్రలో రెవెన్యూ చట్టాల నిపుణులు, లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు ప్రొ.ఎం.సునీల్ కుమార్, పలువురు సీనియర్ న్యాయవాదులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు పాల్గొంటారు.

రెండో యాత్ర రూట్ మ్యాప్

17న ఉదయం 6 గంటలకు రంగారెడ్డి జిల్లా యాచారంలో ప్రారంభమవుతుంది. అటు నుంచి రంగారెడ్డి జిల్లా మాల్, నల్లగొండ జిల్లా చింతపల్లి, మల్లేపల్లి, గుర్రంపోడు, కనగల్, నల్గొండ మీదుగా నార్కట్ పల్లి వరకు సాగుతుంది. రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Next Story

Most Viewed