111 జీవో రద్దు.. గైడ్‌లైన్స్ వస్తేనే నమ్ముతాం అంటున్న ప్రజలు

by Rajesh |
111 జీవో రద్దు.. గైడ్‌లైన్స్ వస్తేనే నమ్ముతాం అంటున్న ప్రజలు
X

‘ఎన్నో ఏండ్ల నుంచి ఇలాగే చెబుతున్నారు. గతేడాది కూడా జీవో 111ను రద్దు చేస్తున్నామని చెప్పి జీవో69ను తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా పూర్తిగా రద్దు చేస్తున్నామంటూ కేబినెట్ మీటింగ్ లో తీర్మానించారు. ఎన్నికల టైమ్‌లో ఇది కామనే.’ ఇవి జీవో 111 పరిధిలోని గ్రామాల ప్రజలు అంటున్న మాటలు. పూర్తిస్థాయిలో నిబంధనలు వచ్చే వరకు ప్రభుత్వాన్ని విశ్వసించలేమని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటనపై ఏదో తిరకాసు ఉన్నదనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో:

ప్రభుత్వం జీఓ 111 ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేబినెట్ తీర్మానించింది. ఆయా గ్రామాల్లో హెచ్ఎండీఏ నిబంధనలే అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ విషయంపై స్థానికుల్లో మాత్రం నమ్మకం కలగడం లేదు. గతేడాది కూడా రద్దు చేశామని ప్రకటిస్తూ జీవో 69 ని జారీ చేశారు కదా! ఇప్పుడు కూడా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రకటించారేమో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రద్దు చేస్తామన్న ప్రకటన వెనుక ఏదో తిరకాసు ఉన్నదంటూ 84 గ్రామాల్లోని నాయకులు అనుమానిస్తున్నారు.

‘జీవో 111 ఎత్తివేయాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. రద్దు చేయడం ద్వారానే తమ ప్రాంతంలోనూ అభివృద్ధి ఉరకలు వేస్తుంది. కానీ ప్రభుత్వ ప్రకటనను విశ్వసించలేం. పూర్తిస్థాయిలో నిబంధనలు వచ్చాక, అమలుకు ప్రభుత్వం సరైన అడుగులు వేసినప్పుడే నమ్ముతాం.’ అని పేర్కొంటున్నారు. అంతేకాకుండా జీఓ రద్దుపై అనేక సాంకేతిక చిక్కులు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయకుండా రద్దు చేశామంటూ చేసిన ప్రకటన ఆచరణలో సాధ్యం కాదని స్థానిక రైతులు భావిస్తున్నారు.

ఒక్క ఆర్డర్ ఇచ్చి రద్దు చేశామనడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పొందలేదని రియల్ ఎస్టేట్ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. ఇంకా కట్టడాలకు, వెంచర్లకు పర్మీషన్ల కోసం వెళ్తే ఇంకాఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతుండడం గమనార్హం. దీంతో దీన్ని గతంలో మాదిరిగా ఎన్నికల స్టంట్ గా ప్రజలు చూస్తున్నారు. ఇప్పటి వరకైతే పంచాయత్ రాజ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. కనీసం నాలా కన్వర్షన్ కి కూడా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని రెవెన్యూ అధికారులు చెప్పారు. మరో జీవో వస్తేనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తామని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.

కోర్టులో కేసు వేస్తే..

మొయినాబాద్ మండలం బాకారంలో మంగళవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పర్యటించారు. జీవో 111 రద్దు చేయడం పట్ల జనాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ‘సంతోషమే.. కానీ ఎవరైనా కోర్టులో మళ్లీ కేసు వేస్తే ఎట్లా? మళ్లీ మొదటికే వస్తుంది కదా.’ అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. కేబినేట్ లో తీర్మానం చేసిన తర్వాత అలాంటివేం ఉండవని, ఎవరైనా కేసు వేస్తే ప్రభుత్వం అంతా చూసుకుంటుందంటూ ఎమ్మెల్యే వారికి సమాధానమిచ్చారు. అయితే ఎవరికైనా ఇంటి అనుమతి, లే అవుట్ పర్మిషన్ దక్కి రిజిస్ట్రేషన్ల వరకు వెళ్తేనే నమ్మగలమని ప్రజలు చెబుతున్నారు.

‘ఇంకా ఎలాంటి గైడ్ లైన్స్ రూపొందించలేదు. అనుమతుల ప్రక్రియలో ఎలాంటి నిబంధనలు ఉంటాయో కూడా లెక్క తేల్చలేదు. జీవో 111 ని జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే. దాన్ని రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. ఇదేం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు.’ అని అధికార వర్గాలు చెప్తున్నాయి. పైగా వరుసగా మూడేండ్లు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి హైదరాబాద్ వాసులకు తాగునీటికి వినియోగించడం లేదని రుజువు చేయడం ద్వారా రద్దు ప్రక్రియ ఈజీ అవుతుందంటున్నారు. ఇప్పటికే ఆ ప్రహసనం పూర్తయింది.

కమిటీ నివేదికల్లోనే రద్దు

ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ లు నగరానికి మంచినీళ్లు అందించే ప్రధాన వనరులుగా ఉన్నాయి. అందుకే వాటిని కాలుష్యం నుంచి కాపాడేందుకు జీవో 111 తెచ్చారు. ఇప్పుడు హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు మంజీరా, సింగూరు, కృష్ణా, గోదావరి జలాలు వస్తున్నాయి. నగరానికి నీటి సరఫరాను 145 ఎంజీడీల నుంచి 562 ఎంజీడీలకు పెంచారు. మరో 344 ఎంజీడీల నీటిని తీసుకురావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఈ సందర్భంగా 1996 లో జారీ చేసిన జీవో 111, జీవో 839 (2016 డిసెంబరు 7), జీవో 165 (2018 మార్చి 19), జీవో 873 (జీవో 2019 డిసెంబరు 20) లను నేతలు ఉటంకిస్తున్నారు. ప్రస్తుతం జంట జలాశయాలను తాగునీటి కోసం వినియోగించడం లేదని ప్రభుత్వ వాదన. దీనికి తోడు జీవో 111 పై నియమించిన హై పవర్ కమిటీ గత నెల 31న రిపోర్టు సమర్పించింది. అందుకే అప్పటి నిబంధనలను సడలించారు.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను ఎఫ్ టీఎల్ నుంచి 10 కి.మీ. దూరం వరకు 1.32 లక్షల ఎకరాల క్యాచ్ మెంట్ ఏరియా పరిధిలో నిబంధనలను సడలించారు. ఐతే గతేడాది ఏప్రిల్ లో జారీ చేసిన జీవో 69 నివేదిక ఏం ఇచ్చిందన్న దానిపై సాంకేతిక నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆ ప్రస్తావనే తీసుకురాకుండా పూర్తిగా రద్దు చేస్తున్నామని, హెచ్ఎండీఏ నిబంధనలనే అమలు చేస్తామని ప్రకటించడంతో గందరగోళం నెలకొన్నది. సాంకేతిక చిక్కులను అధిగమించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వెల్లడించకపోతే రద్దు ప్రక్రియ పట్ల అనుమానాలు కొనసాగుతాయి.

మాస్టర్ ప్లాన్ అవసరం

రెండు జలశయాలను కాపాడేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్ ని రూపొందించాలి. ఈ 84 గ్రామాల్లో సాధారణ నిబంధనలనే అమలు చేయడం ద్వారా తలెత్తే విపత్తును నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. డ్రైనేజీ కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, గ్రీన్ జోన్.. రెసిడెన్షియల్ జోన్, అగ్రికల్చరల్ జోన్.. వంటి వాటి గుర్తింపుతో కూడిన మాస్టర్ ప్లాన్ రావాల్సిన అవసరం ఉందని స్థానిక రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. స్థానికులంతా అభివృద్ధిని కోరుకుంటున్నారు. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే కేసులు, వివాదాలు తలెత్తవంటున్నారు. దానికి భిన్నంగా ఏకపక్షంగా రద్దు చేయడం ద్వారా మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

ఎన్నికలకు ముందు కామనే

- కే సంజీవరెడ్డి, నాగిరెడ్డిగూడ

అప్లికేషన్ పెట్టుకుంటే అనుమతులొచ్చినప్పుడే నమ్ముతాం. ఎవరికైనా పర్మిషన్ వచ్చిందని లెటర్ చూపిస్తే నమ్మొచ్చు. అప్పటి దాకా మేం నమ్మలేం. నేను నాలా కన్వర్షన్ కి అప్లయ్ చేసుకుంటే చేస్తారా అని తహశీల్దార్ ని అడిగాను. ఇంకా మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఎంతో మంది పెద్దలు మా ప్రాంతంలో భూములు కొన్నారు. స్థానికుల దగ్గర 20 శాతం కూడా భూములు లేవు. రద్దు చేయడం ద్వారా అభివృద్ధి చెందుతుందని ఆశ మాత్రమే. ఇదంతా ఎన్నికలకు ముందు కామన్.

అన్ని గ్రామాల్లో ఒకేలా లేదు

-ఎం.మహేందర్ రెడ్డి, మొయినాబాద్

జీవో 111 రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. హెచ్ఎండీఏ నిబంధనలను అమలు చేస్తామంటున్నారు. రెండు చెరువుల నీళ్లనైతే వాడడం లేదు. ఇక గ్రీన్ ట్రిబ్యునల్, ఇతర కేసులన్నింట్లో ప్రభుత్వం గెలవాలి. రద్దు చేయాలని గతంలో కాంగ్రెస్, బీజేపీలు కూడా ధర్నాలు చేశాయి. ఇప్పుడేమో రాద్దాంతం చేస్తున్నారు. ఇప్పటికైతే రియల్ ఎస్టేట్, స్థానికుల్లో సంతోషం కనబడుతుంది.

అన్ని గ్రామాల్లో భూముల అమ్మకాలు ఒకేలా లేవు. హిమాయత్ నగర్ వంటి గ్రామాల్లో 80 శాతం భూములు స్థానికేతరులవే. అలాగే సిటీకి దూరంగా ఉన్న గ్రామాల్లో 50 శాతం మాత్రమే అమ్మకాలు సాగాయి. అక్కడ మిగతా భూములన్నీ స్థానిక రైతుల చేతుల్లోనే ఉన్నాయి. కొన్నవారిలో స్థానికులు, స్థానిక రియల్టర్లు కూడా ఉన్నారు. రద్దు చేయడం ద్వారా స్థానికులకు ప్రయోజనం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed