అంబేద్కర్‌తో కేసీఆర్‌కు పోలికేంటి.. RS ప్రవీణ్ కుమార్ సీరియస్

by Disha Web Desk 2 |
అంబేద్కర్‌తో కేసీఆర్‌కు పోలికేంటి.. RS ప్రవీణ్ కుమార్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి ఆరో నిజాం వలే ఫలక్‌నుమా ప్యాలెస్ కట్టుకున్నారని, నిజాంకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతదని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రగతి భవన్ ఒక గడీ.. సెక్రటేరియట్ ఇంకొక గడీ అని, సచివాలయం నిర్మాణం వల్ల ప్రజల బతుకుల్లో గుణాత్మకమైన మార్పులు రావని పేర్కొన్నారు. నూతన సచివాలయంలో పాలన ఏమైనా మారుతుందా.. కమీషన్లు లేకుండా ఫైళ్ల మీద సంతకాలు పెడతారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రోజు సచివాలయానికి వస్తారా? అని నిలదీశారు. ప్రజలు సచివాలయం కావాలని అడిగారా ? అని, సచివాలయం ఇలా ఉండాలని ఎవరూ అడగలేదన్నారు. ప్రజలు స్వచ్ఛమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అడుగుతున్నారని వివరించారు. పాలన భవనం నిర్మించారా? ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నిర్మించారా? అని ప్రశ్నించారు. వందల మంది పోలీసుల పహారా ఎందుకు? అని నిలదీశారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సచివాలయం అని చూపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ముఖ్యమంత్రి వారందరినీ పట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. నూతన సచివాలయంలో వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందా అని ప్రశ్నించారు.

అంబేద్కర్‌తో కేసీఆర్‌కు పోలికా?

నూతన సచివాలయం ఓపెనింగ్ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను అంబేద్కర్‌తో పోల్చిన పేపర్ ప్రకటనలపై ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఓ నిజంగానా?" న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాడేందుకు అంబేద్కర్ తన నలుగురు పిల్లలను త్యాగం చేశారని గుర్తుచేశారు. మరోవైపు అమరవీరుల త్యాగాలతో కేసీఆర్ తన ‘కుటుంబ’ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని తెలంగాణ భవిష్యత్తును దోచుకున్నారు! అంటూ ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ చేస్తూ.. గత నాలుగేళ్ల నుంచి గొడ్డు చాకిరీ చేయించుకున్న పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేసే ఫైలుపై నేడు కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి సుందరమైన చాంబర్లో సంతకం పెట్టాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. అలంపూర్ జోగులాంబ జిల్లాలో ఆర్డీఎస్ కాలువలో పూడికతీత పనులు జరుగుతున్నాయి. దీనిపై స్పందిస్తూ.. మూడు ఇంచుల సీసీ లైనింగ్ ఉన్న ఆర్డీఎస్ కాలువలో 13 టన్నుల బరువు కలిగిన 200 ఎల్ అండ్ టీ మిషన్‌తో పూడికతీస్తున్నారని తెలిపారు. అంత పలుచగా ఉన్న సీసీ లైనింగ్ పై 13 టన్నుల మెషిన్ ఎక్కితే పూడిక తీయడం ఏమోగానీ ఉన్న సీసీ లైనింగ్ అంత పగిలి పోతుందన్నారు. కేసీఆర్.. మీ పాలనలో అలంపూర్ కి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ, కీడు చేయకండి అంటూ ట్వీట్ చేశారు.


Next Story