జంప్ జిలానీలపై బీఆర్ఎస్ నయా స్కెచ్.. దానం, కడియంకు చెక్ పెట్టేలా స్ట్రాటజీ

by Disha Web Desk 13 |
జంప్ జిలానీలపై బీఆర్ఎస్ నయా స్కెచ్.. దానం, కడియంకు చెక్ పెట్టేలా స్ట్రాటజీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్‌‌కు చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారు. వీరి బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న వారి విషయంలో బీఆర్ఎస్ అంతే సీరియస్ యాక్షన్‌లోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. దానం, కడియం బాటలో ఇతరులు పార్టీ మారకుండా ఉండేలా నిలువరించడంతోపాటు పార్టీ మారినవారికి తగిన బుద్ధి చెప్పేలా ‘పదవులకు రాజీనామా చేయాల్సిందే’ అనే డిమాండ్ వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు అవసరం అయితే లీగల్ ఫైట్ చేసేలా గులాబీ బాస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

రాజకీయంగా దెబ్బకొట్టేలా..

కష్టకాలంలో పార్టీని మరింత ఇరకాటంలో పెడుతున్న ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ కేడర్ రగిలిపోతున్నది. దీంతో వారిపై అనర్హత వేటు పడేలా చేయడంతోపాటు వారిని రాజకీయంగా దెబ్బతీయాలనే కసితో అధిష్టానం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ విషయంలో స్పీకర్‌తోపాటు హైకోర్టు వరకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు తాజాగా కడియంపైనా ఇదే తరహాలో యాక్షన్‌లోకి దిగబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన కడియం శ్రీహరిపై వేటు వేయాలని, అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదు చేసేందుకు స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.

గుణపాఠం చెప్పాల్సిందే..

బీఆర్ఎస్‌ను వీడుతున్న వారు ఎంపీ ఎన్నికల బరిలో నిలిస్తే అలాంటి సెగ్మెంట్లలో వారిని కచ్చితంగా ఓడించేలా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ విషయంలో దానంకు వ్యతిరేకంగా పద్మారావును బరిలోకి దింపగా ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు కోసం స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి ప్రచార పర్వంలో దూకుడు పెంచుతున్నారు. వరంగల్ విషయంలోనూ ఇదే స్ట్రాటజీని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈసీ, స్పీకర్ ఏం చేస్తున్నట్టు?

దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. ‘ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికైన మూడు నెలల్లోనే మరో పార్టీలోకి జంప్ అవుతున్నప్పుడు ఎన్నికల సంఘం, అసెంబ్లీ స్పీకర్ ఏం చేస్తున్నారు? తెలంగాణలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి పట్ల స్పీకర్, ఈసీ కేవలం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. ఇద్దరిపై ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను, అసెంబ్లీ స్పీకర్‌ను కోరుతున్నాం’ అని ట్వీట్ చేసింది.



Next Story

Most Viewed