బోధన్ ఎమ్మెల్యే సతీమణి కారు ఢీకొన్న ఘటన : చికిత్స పొందుతూ బాలుడు మృతి

by Disha Web Desk 4 |
బోధన్ ఎమ్మెల్యే సతీమణి కారు ఢీకొన్న ఘటన : చికిత్స పొందుతూ బాలుడు మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాల గాయాల పాలై చికిత్స పొందుతున్న బాలుడు దీపక్ తేజ మృతి చెందాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మద్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంకాలం ఎమ్మెల్యే భార్య, అనుచరులు ప్రయాణిస్తున్న కారు బోధన్ పట్టణంలోని మర్రి మైసమ్మ వద్ద గల రాయల్.. గార్డెన్ సమీపంలో అజయ్ అలియాస్ దీపక్ అనే బాలుడిని ఢీకొట్టింది. అతడికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే పరిస్థితి క్లిష్టంగా మారడంతో హైదరాబాద్ తరలిస్తుండగా దీపక్ తేజ్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిదని సమాచారం.

బోధన్ పట్టణానికి చెందిన ఒడ్డన్న, రాధా బాబు దీపక్ తల్లిదండ్రులు. వీరికి వివాహమైన తర్వాత 14 సంవత్సరాలకు సంతానం కలిగింది. దీపక్ ఏకైక సంతానం కావటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒడ్డెన్న కొన్ని సంవత్సరాలు దుబాయిలో పని చేసి వచ్చి ప్రస్తుతం ఓ బార్ షాపులో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. ప్రాణాలు కోల్పోయిన దీపక్ తేజ్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గతంలో హైదరాబాద్ బంజారా‌హిల్స్‌లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వేగంగా వెళ్తూ ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. ఆ ఘటనపై కేసు నమోదు కాలేదు. ఇపుడు కూడా కేసు నమోదు అయ్యే ఛాన్స్ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీపక్ తేజ్ బంధువులు మాత్రం ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.

Next Story