ప్రతి హిందూ ఇంటిపై కాషాయం జెండా.. రామనవమి సక్సెస్ చేయాలని బీజేపీ నిర్ణయం

by Disha Web Desk 12 |
ప్రతి హిందూ ఇంటిపై కాషాయం జెండా.. రామనవమి సక్సెస్ చేయాలని బీజేపీ నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: డజను పార్లమెంటు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వెళ్తున్న కమలం పార్టీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే ఈనెల 17వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండాను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని, శోభాయాత్రలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. రామనవమి సందర్భంగా ప్రతి బూత్ లెవెల్‌లో ఆరోజు ఏదో ఒక రకమైన కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికను కమలం పార్టీ రూపొందించుకుంది. శోభాయాత్రలతో పాటు ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంది. ప్రతి బూత్ లెవెల్‌లో రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్లీలూ, జెండాలు కట్టాలని నిర్ణయించారు.

ఇంటింటికీ బీజేపీ నినాదం

ఇప్పటికే ఇంటింటికీ బీజేపీ అనే నినాదంతో కమలనాథులు మేనిఫెస్టో అంశాలను కరపత్రం రూపంలో అందిస్తున్నారు. శ్రీరామనవమి వేడుకలతో మరోసారి ఓటర్లను కలుసుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రజల్లో చైతన్యం నింపడంతో పాటు తమ పార్టీ వైపు ఆకర్షితులను చేయాలని చూస్తోంది. ఈ వేడుకల్లో బీజేపీ అనుబంధ సంఘాలతో పాటు సంఘ పరివార క్షేత్రాలకు చెందిన వారు భాగస్వాములు కానున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే నేతలు, కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఈ వేడుకలో కార్యకర్తలు, నాయకులు కాషాయ కండువాలు మాత్రమే ఉపయోగించాలని, పార్టీ కండువాలు వాడొద్దని సూచనలు చేసినట్లు సమాచారం.

అభివృద్ధిని వివరిస్తూ..

హిందువుల ఓట్లన్నీ బీజేపీకి గంప గుత్త గా బీజేపీకి పడేలా ఈ వేడుకలను నిర్వహించాలని నాయకత్వం ప్లాన్ చేసింది. అంతేకాకుండా అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట ప్రజలకు మరోసారి వివరించేందుకు ఈ వేడుకలు కలిసొస్తాయని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే అయోధ్య అక్షింతల పేరుతో ప్రజలను కలిసిన బీజేపీ, మరోసారి శ్రీరామనవమి సందర్భంగా కలిసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా ప్రజలను కలిసి ఈ పదేండ్లలో మోడీ సర్కారు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. అంతేకాకుండా కరపత్రాలు, స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికించేలా ప్లాన్ చేసుకున్నారు. శ్రీరామనవమి వేడుకలు భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్న కమలం పార్టీకి రాముడి ఆశీస్సులు దొరుకుతాయో లేదో చూడాలి. ఈ అంశం బీజేపీకి ఎంత మేరకు లబ్ధి చేకూరుతుందనేది చూడాలి.


Next Story