ప్రజలకు న్యాయం చేసే నైజం ఆ పార్టీ​డీఎన్‌ఏలోనే లేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ప్రజలకు న్యాయం చేసే నైజం ఆ పార్టీ​డీఎన్‌ఏలోనే లేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​నాయకుల మాటలు కోటలు దాటుతాయి తప్ప.. పనులు వారి ఆఫీసు కూడా దాటవని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి విమర్శించారు. విద్యా వ్యవస్థ మెరుగు పరిచేందుకు సరిపోను నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్​ చేశారు. సికింద్రాబాద్​ పార్లమెంట్​సెగ్మెంట్‌లోని సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి మోండా మార్కెట్, రాంగోపాల్ పేట్, బేగంపేట్, అమీర్ పేట డివిజన్‌లో ఎంపీ ల్యాడ్స్‌తో ఏర్పాటు చేసిన పవర్ బోర్లను ఆదివారం కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ బడ్జెట్‌ను కేటాయించిందని ఆయన విమర్శలు చేశారు. స్కూళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, హాస్టళ్లలో కలుషిత నీరు తాగడం, ఆహారం తినడం వల్ల ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరగకుండా చూడాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన కొద్దిపాటి నిధులతో బడుల్లో కనీస వసతులు కల్పించడం వీలు కాదని ఆయన తెలిపారు.

సర్కారు బడుల్లో టాయిలెట్లు, తాగేందుకు మంచినీళ్లు లేక విద్యార్థులు ఇబ్బందిపడితే.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు ఇచ్చినా.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మైనార్టీ విద్యార్థుల కోసం కేంద్రం హాస్టల్ మంజూరు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల నుంచి భూమి కూడా కేటాయించడం లేదని మండిపడ్డారు. సుమారు 23 హాస్టళ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్లు వెల్లడించారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి అనేక విషయాల్లో సహకరిస్తున్నా.. కేంద్ర నిధులను గత సర్కారు సద్వినియోగం చేసుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వంలోనైనా మార్పు వస్తుందని తాము అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర అవినీతి చుట్టూ, కుటుంబాల చుట్టే ఉన్నది తప్పా.. ప్రజలకు న్యాయం చేసే నైజం ఆ పార్టీ​ డీఎన్​ఏలోనే లేదని ఆరోపించారు. మాటల గారడి తప్ప బడ్జెట్​లో పేదలకు జరిగిన మేలు ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed