రాష్ట్రపతి భవన్‌లో భారత రత్న అవార్డుల ప్రధానం

by Disha Web Desk 4 |
రాష్ట్రపతి భవన్‌లో భారత రత్న అవార్డుల ప్రధానం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న అవార్డులను అందజేశారు. వీరందరికీ మరణానంతరం అవార్డు లభించడంతో వారి కుటుంబ సభ్యులు ఈ సన్మానాన్ని అందుకున్నారు. పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, చరణ్‌ సింగ్‌ మనవడు రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అధ్యక్షుడు జయంత్‌ చౌదరి, కర్పూరీ ఠాకూర్‌ కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకూర్‌, స్వామినాథన్‌ కుమార్తె నిత్యారావులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

అద్వానీకి ఈనెల 31న అందజేత!

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తంగా ఐదుగురు ప్రముఖులకు భారతరత్న ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం అవార్డులు అందుకున్న నలుగురితో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి కూడా అత్యున్నత పురస్కారం ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల అద్వానీ ఈ కార్యక్రమానికి రాలేదు. దీంతో రాష్ట్రపతి ముర్ము ఈనెల 31(ఆదివారం) నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్నతో సత్కరించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అద్వానీ ఇంటికి వెళ్లనున్నట్టు సమాచారం. కాగా, 2014 నుంచి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు 53మందిని భారతరత్నతో సత్కరించింది.


Next Story