టీకాంగ్రెస్‌కు కేసీఆర్ రూ. వెయ్యి కోట్ల సాయం: బండి సంజయ్

by Disha Web Desk 2 |
టీకాంగ్రెస్‌కు కేసీఆర్ రూ. వెయ్యి కోట్ల సాయం: బండి సంజయ్
X

దిశ, ప్రతినిధి నిర్మల్: ఢిల్లీ లిక్కర్ కేసు ఇంకా తేలలేదని, ఈడీ విచారణ సాగుతోందని ఆ కేసులో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే కాపాడాలని సీఎం కేసీఆర్ ఎవరి కాళ్లు పట్టుకొని బతిమిలాడినా వదిలిపెట్టరని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. లిక్కర్ కేసులో కవిత అరెస్టు విషయమై నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈడీ ఒక స్వతంత్ర సంస్థ అని బీజేపీతో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. పూర్తి విచారణ అనంతరం ఆ సంస్థ దోషులను తేలుస్తుందని అన్నారు. కేసుతో కవితకు సంబంధం ఉన్నట్లు తేలితే జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు సంబంధం లేకపోతే ఆమె తండ్రి కేసీఆర్ అన్న కేటీఆర్‌లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నది సీఎం కేసీఆర్ అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి పూర్తి వనరులు కేసీఆరే సమకూరుస్తున్నాడని చెప్పారు. ఎక్కడైనా రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనంగా ఉందని అనిపిస్తే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని లేపుతున్నాడని, ఆ పార్టీకి అభ్యర్థులకు డబ్బులు సమకూరుస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు పాకెట్ మనీ కిందనే రూ.1000 కోట్లు ఇచ్చాడని తెలిపారు. రాష్ట్రంలో ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మూడు ఒకటేనని ఆయన అభిప్రాయపడ్డారు.

కుమారస్వామిని మోసగించాడు...

కర్ణాటకలో జేడీఎస్ నేత కుమారస్వామిని సీఎం కేసీఆర్ మోసగించాడని బండి సంజయ్ ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు సమయంలో కుమారస్వామిని వాడుకున్నాడని, ఇప్పుడు కుమారస్వామి ఫోన్ కూడా కేసీఆర్ ఎత్తడం లేదని సెటైర్లు వేశారు. కర్ణాటకలో తమ పార్టీకి ఓట్ల శాతంలో ఏమాత్రం బలం తగ్గలేదన్నారు. అక్కడ ఎంఐఎం కాంగ్రెస్, మరో పార్టీ ఒక్కటై ఎన్నికల్లో పోటీ చేయడం వల్లనే అనేక సీట్లలో స్వల్ప మెజార్టీతో తమ పార్టీ ఓటమి పాలయిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ నేతలు పాల్గొన్నారు.

Also Read...

కేసీఆర్ మాట లెక్కచేయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!


Next Story

Most Viewed