తిరిగి ప్రజాక్షేత్రంలోకి బండి.. అమిత్ షా రాక

by Disha Web Desk 4 |
తిరిగి ప్రజాక్షేత్రంలోకి బండి..  అమిత్ షా రాక
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​ప్రజాక్షేత్రంలోకి తిరిగి వెళ్లనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై తన పోరును తిరిగి మొదలెట్టేందుకు సిద్ధమయ్యారు. మరో నెలలో బండి సంజయ్​ తన ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. ఏప్రిల్​ 14న ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి తన రెండో విడత పాదయాత్రను ఆయన మొదలెడుతున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా హాజరుకానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పాదయాత్రకు తోడు బండి సంజయ్​ త్వరలోనే జనగామ జిల్లాలో భారీ బహిరంగ సభకు ప్లాన్ ​చేశారు. ఈ నెల చివరిలో లేదా ఏప్రిల్​ మొదటి వారంలో నిర్వహించాలనే యోచనలో బీజేపీ నాయకత్వం భావిస్తోంది. జనగామలోని భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ జిల్లా నుంచి మొదలుకొని ఆదిలాబాద్​ వరకు నిర్వహించాలని బండి సంజయ్​ ప్లాన్ ​చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో ఉన్న బీజేపీ ఫుల్​ జోష్​లో ఉంది. ఇదే జోష్​ను బీజేపీ శ్రేణుల్లో తగ్గకుండా చూసుకోవడంతో పాటు మరింత జోష్​ నింపేందుకు జాతీయ నాయకత్వం సైతం ప్రణాళికలు చేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్​ తెలంగాణ మీదనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​గతంలో బహిరంగంగానే వెల్లడించారు. తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలు కేంద్ర హోం శాఖ మంత్రి పర్యటనలు ఉండటంతో బీజేపీ వచ్చే ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవాలని సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన బండి సంజయ్ ​బృందానికి తెలంగాణలో పర్యటిస్తానని అమిత్​షా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ​ముందస్తుకు వెళ్లినా.. సాధారణ ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండేలా యాక్షన్​ ప్లాన్​ను బీజేపీ జాతీయ నాయకత్వం రూపొందిస్తున్నట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది. అయితే తెలంగాణలో బండి సంజయ్​తో పాటు బీజేపీ నేతలపై టీఆర్ఎస్​ నేతలు చేపట్టిన దాడులు, ఎంపీ అని కూడా చూడకుండా బండి సంజయ్ ​కార్యాలయాన్ని గ్యాస్ ​కట్టర్లతో కట్​చేసి జైలుకు తరలించడం వంటి అంశాలపై హైకమాండ్​ రాష్ట్ర ప్రభుత్వంపై చాలా సీరియస్​గా ఉంది. జైలు నుంచి బండి సంజయ్ ​బయటకు వచ్చిన అనంతరం మధ్య ప్రదేశ్ ​ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్​తో పాటు పలువురు కేంద్ర మంత్రులు సైతం తెలంగాణకు వచ్చి పరిస్థితులపై ఆరా తీశారు. అదే సమయంలో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా బహిరంగంగానే ఇక తెలంగాణకు హైకమాండ్, కేంద్ర మంత్రుల రాకపోకలు పెరగుతాయని టీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అందులో భాగంగా జనగామలో నిర్వహించే భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఆ సభ ఈ నెల చివ‌రివారంలో లేదా ఏప్రిల్​మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది. తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.

బండి సంజయ్ ​ప్రజాసంగ్రామ యాత్రకు అమిత్​షా రావడమే కాకుండా రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. బూత్ లెవ‌ల్ కార్యకర్తలతో ఆయన స‌మావేశమయ్యే అవకాశాలున్నట్లు కమలనాథులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు బీజేపీతో ట‌చ్‌లో ఉన్నట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్​చుగ్​ పలుమార్లు తెలిపారు. అమిత్​షా రాక సందర్భంగా పలు పార్టీలకు చెందిన కీలక నేతలు ఆయన సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో రాష్ట్ర నాయ‌క‌త్వానికి సంబంధం లేకుండా నియోజ‌కవ‌ర్గాల్లో ప్రత్యేక టీంలు పర్యటిస్తాయని తెలుస్తోంది. నియోజ‌కవ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితుల‌పై ఆ టీం ఆరా తీసి జాతీయ నాయకత్వానికి ఎప్పటికప్పుడు అందించనుంది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాల‌ని, అలాంటి నేతలను పట్టుకోవాలనే యోచనలో జాతీయ నాయ‌క‌త్వం ఉంది. మొత్తానికి తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే ద‌క్షిణ భార‌తదేశంలో బలోపేతం కావొచ్చని జాతీయ‌ నాయ‌క‌త్వం యోచిస్తోంది.

Next Story

Most Viewed