నేను రాజీనామా చేస్తా.. ఛాలెంజ్‌కు కేసీఆర్ సిద్ధమా?: Bandi Sanjay Kumar

by Disha Web Desk 2 |
నేను రాజీనామా చేస్తా.. ఛాలెంజ్‌కు కేసీఆర్ సిద్ధమా?: Bandi Sanjay Kumar
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేస్తున్న భూదందాలు, కమీషన్ల దోపిడీ భరించలేక విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా పారిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం పంచ భూతాలను వ్యాపారంగా మారుస్తున్న మూర్ఖులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన ప్రజా గోస – బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. 24 గంటల విద్యుత్‌పై కేసీఆర్ చెప్పేవన్నీ వట్టి బూటకమే అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని నిరూపించకపోతే కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకుంటారా అని ఛాలెంజ్ విసిరారు.

అమెరికాలో చిప్పలు కడిగి వచ్చి అయ్య పేరు చెప్పుకుని పదవులు సంపాదించిన కేటీఆర్ ఇవాళ నాపై అవాకులు చెవాకులు పేలుతున్నాడని ఫైర్ అయ్యారు. నీకులాగా తండ్రి పేరు చెప్పుకుని పార్టీకి అధ్యక్షుడిని కాలేదని పార్టీ కోసం కష్టపడి పైకి ఎదిగి వచ్చానన్నారు. బీజేపీలో సామాన్య కార్యకర్త సైతం సీఎం, పీఎం, అధ్యక్షులు అవుతారని అదే బీఆర్ఎస్ పార్టీలో ఓ కార్యకర్త అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కాగలరా అని ప్రశ్నించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని అతడు తంబాకుకు లవంగానికి తేడా కూడా తెలియని మూర్ఖుడు అని మండిపడ్డారు. డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని పిలిస్తే తోక ముడిచిన కేటీఆర్ ఒంట్లో నుంచి డ్రగ్స్ ఆనవాళ్లన్నీ పోయాయని తెలిశాక వచ్చి వాగుతున్నాడని ధ్వజమెత్తారు.

దేవుడిని, పంచభూతాలను సైతం వ్యాపారం చేసే మూర్ఖులు మీరని విరుచుకుపడ్డారు. 2023 నాటికి హైదరాబాద్ లైఫ్ సెన్సెస్ పరిశ్రమ విలువను 250 బిలియన్ డాలర్లకు పెంచుతానని కేటీఆర్ చెబుతున్నాడు. నిజానికి కల్వకుంట్ల కుటుంబం లేకపోతే 2030 నాటికి దాని విలువ 500 బిలియన్ డాలర్లకుపైగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కమీషన్ల భరించలేక పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయన్నారు. కేంద్రంలోని మోడీ పాలనను చూసి 150 దేశాలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. గత 75 ఏళ్లలో దేశానికి ఎన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయో అందులో 50 శాతానికిపైగా మోడీ పాలనలోనే వచ్చాయన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఎంత వరకు చదివితే అంత వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ తాను మాత్రం వంద గదుల ఇంటిని కట్టుకున్నాడని దాంట్లో రోజుకో రూమ్ లో తాగి పడుకోవడం తప్ప పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం గత 3 నెలల్లోనే 2.16 లక్షల ఉద్యోగాలకు సంబంధించి అపాయిట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చారని చెప్పారు. నయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని, నయీం డైరీ ఏమైందని ప్రశ్నించారు. నయీం ఆస్తులను ఎవరూ కొనుగోలు చేయవద్దని తాము అధికారంలోకి వస్తే నయీం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు. నికార్సయిన హిందువు పేరుతో కేసీఆర్ హిందువులను మోసం చేయాలనుకుంటున్నడని ధ్వజమెత్తారు. రోజుకో దేవుడిని మొక్కుతారంటూ ఎంఐఎం నేతలు వెటకారం చేస్తున్నారు. బరాబర్ రోజుకో దేవుడిని మొక్కుతాం మీకేం నొప్పి అని నిలదీశారు. రామరాజ్యం రావాలంటే పువ్వు గుర్తుకే ఓటేయాలని సూచించారు.


Next Story