దూకుడు పెంచిన బీజేపీ.. మరోసారి ఈటల, ‘బండి’కి కీలక బాధ్యతలు!

by Disha Web Desk 2 |
దూకుడు పెంచిన బీజేపీ.. మరోసారి ఈటల, ‘బండి’కి కీలక బాధ్యతలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నది. అందులో భాగంగా చేరికల కమిటీని మళ్లీ యాక్టివ్ చేయాలని భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈటల రాజేందర్ చైర్మన్‌గా బీజేపీ జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు కాబోతున్నదనే చర్చ జరుగుతున్నది. దీని ద్వారా ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న కోల్డ్ వార్‌ను కూడా చెక్ పెట్టవచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలెవరు?

బీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే వారు ఎవరనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతున్నది. బీఆర్ఎస్ ఎంపీలు నిజంగానే బీజేపీ నేతలకు టచ్ లో ఉన్నారా? లేక బీజేపీ మైండ్ గేమ్ ప్లాన్ ఆడుతున్నదా? అనే చర్చ కూడా జరుగుతున్నది. బీజేపీలో ఇప్పటికే కొన్ని పార్లమెంట్ స్థానాలకు భారీ డిమాండ్ నెలకొంది. మల్కాజ్ గిరి, జహీరాబాద్, మెదక్, హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో గట్టిపోటీ ఉన్నది. ఈ సెగ్మెంట్లకు చెందిన ఇతర పార్టీల నేతలు కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు.

టార్గెట్ సెకండ్ క్యాడర్

పార్లమెంట్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నది. బీఆర్ఎస్ లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బీజేపీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నది. స్థానిక సంస్థల్లో బలోపేతమయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగవచ్చని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. లోక్ సభ ఎలక్షన్స్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటే విధంగా పనిచేయాలని, అందుకు తగ్గట్టుగా సిద్ధం కావాలని పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగా విస్తృతంగా కింది స్థాయి నేతలను పార్టీలో చేర్చుకోవాలని స్కెచ్ వేసింది. బండి, ఈటల నేతృత్వంలో చేరికల కమిటీ ఏర్పాటైతే హైకమాండ్ వారి ఎదుట పెద్ద టార్గెట్ పెట్టినట్లేనని టాక్. మరి బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు కాషాయ తీర్థం పుచ్చుకుంటారా? వారికి ఎలాంటి భరోసానివ్వబోతున్నారనేది వేచి చూడాలి.


Next Story