ఇప్పుడు అన్నీ స్మార్ట్ నేరాలే.. ప్రజలు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుకోవాలి: మంత్రి KTR

by Disha Web Desk 12 |
ఇప్పుడు అన్నీ స్మార్ట్ నేరాలే.. ప్రజలు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుకోవాలి: మంత్రి KTR
X

దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్రానికి సైబర్ ఎకోసిస్టమ్‌ ను సురక్షితంగా ఉంచడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీని శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్మాట్లాడుతూ.. టెక్నాలజీ పెరిగిన కొద్దీ అదే స్థాయిలో నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయని, వాటిని అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ కూడా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

నేరాల నివారణకు కొత్త యుగం పరిష్కారాలు అవసరమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఓటర్లకు డిజిటల్‌ చెల్లింపుల ద్వారా నగదు బదిలీ చేసినట్లు గుర్తించామని, ఈ విషయంపై ఎన్నికల సంఘం కూడా అప్రమత్తం కావాలన్నారు ప్రతిచోటా సాంకేతిక ఉన్న ప్రపంచంలో మనం జీవిస్తున్నామని, సాకేంతిక పరికరాలు జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయని, పరికరాలు పరస్పరం మాట్లాడుకునే కనెక్ట్ చేయబడిన ప్రపంచంలో మనం జీవిస్తున్నామని అన్నారు కేటీఆర్.

ఈ పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ పెద్ద సవాలుగా మారిందని, ఇదే ఇప్పుడు పెనుముప్పుగా పరిణమిస్తుందని, వాటిని అధిగమించాలంటే ఇంకా అధునాతన టెక్నాలజీ అవసరమన్నారు. సైబర్ నేరాలు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాదని, అవి చిన్న, మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయని, కాబట్టి మనం అవగాహన పెంచుకోవాలని, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అందుకే ఆల్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ 1930 అందుబాటులో ఉందని తెలిపారు. వ్యక్తుల కంటే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి సంస్థలను మనం నిర్మించాలని, వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమని ఆయన అన్నారు.

ఇలాంటి కార్యక్రమాల్లో పరిశ్రమలు భాగస్వాములు కావాలని, అందరూ ముందుకు రావాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నగరంలో ఐటీ రంగంలో లక్ష మందికి పైగా పనిచేస్తున్నారని, అందరూ సైబర్ యోధులుగా మారాల్సిన అవసరం ఉందని, సైబర్ క్రైమ్‌లపై మొదటి ముసాయిదా చట్టంపై పని చేస్తున్నామని అది త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు కేటీఆర్. లైంగిక నేరస్తుల నమోదుపై హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులు కృషి చేయాలని కేటీఆర్‌ కోరారు.

అలాంటి నేరాలకు పాల్పడే వారు ఉద్యోగాల నుండి నిషేధించబడతారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలను ఉపయోగించకుండా నిషేధించబడతారని అందుకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించినున్నట్లు తెలిపారు. కొత్తగా ప్రారంభించబడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టెక్నికల్ డైరెక్టర్‌ గా కూడా ఉన్న మాజీ డీఆర్ డీఓ నిపుణుడు రామ్ గణేష్ స్థాపించిన హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సైబర్ ఐ ద్వారా ఈ చొరవ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన కస్టమైజ్డ్ క్రైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించబడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే గ్రౌండ్ పోలీస్ సిబ్బంది రచించిన (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్)ను కూడా ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్.

హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ..దేశంలోని మొత్తం సీసీటీవీల్లో రాష్ట్రంలో 64 శాతం ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కువ నేరాలు జరగనప్పటికీ, మన పౌరులు చాలా మంది ఇతర చోట్ల జరిగే సైబర్ నేరాలకు బాధితులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు డిజిటల్ కాంపోనెంట్స్ లేకుండా నేరాలు జరగవని అన్నారు. సైబర్ నేరాలకు ప్రభావితం కాని వ్యక్తులు లేరని, కాబట్టి పోలీసులు ప్రభావవంతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

పోలీసులు భౌతిక శక్తి నుండి టెక్-అవగాహన శక్తిగా పరిణామం చెందాలని, మనం సులువుగా పనిచేసే సాంకేతిక ఆధారిత శక్తిగా ఉండాలన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ప్రతి పౌరుడికి తాము సురక్షితంగా ఉన్నామని, పోలీసులు తమ భద్రతకు భరోసా ఇస్తారని అన్నారు. సైబర్ ఎకో సిస్టమ్ పరంగా తెలంగాణను సురక్షితంగా ఉంచడమే మా లక్ష్యమని, కొంతకాలం క్రితం ప్రారంభించిన కమాండ్ కంట్రోల్‌లో డజన్ల కొద్దీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు ఉంటాయని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. సైబర్ సేఫ్టీ కోసం టీఎస్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణ పోలీసుల టోపీలో మరో రెక్క అని, వారు ఇప్పటికే సాంకేతికతను ఉపయోగించుకోవడంలో అగ్రగామిగా పనిచేస్తున్నారని అన్నారు.

సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మాట్లాడుతూ.. సైబరాబాద్‌ పోలీసులకు ప్రత్యేకించి తెలంగాణ పోలీసులకు ఇది కల సాకారమన్నారు. పౌరుల ఆకాంక్ష, సాంకేతికతను స్వీకరించడం, పని ప్రక్రియకు అనుగుణంగా ఉండే కొత్త యుగం పోలీసింగ్ మనకు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, ఎస్సీ ఎస్సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, పోలీసు అధికారులు, ఆయా సాఫ్ట్ వేర్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు


Next Story

Most Viewed