తెలంగాణలో దుమారం రేపుతున్న మరో స్కాం.. BRS MP, T-BJP కీలక నేత హస్తం..?

by Disha Web Desk 19 |
తెలంగాణలో దుమారం రేపుతున్న మరో స్కాం.. BRS MP, T-BJP కీలక నేత హస్తం..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంతో పాటు క్యాసినో వ్యవహారం, గ్రానైట్ ఎక్స్ పోర్ట్ లావాదేవీల్లో అవకతవకలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో కుంభకోణం అంశం సంచలనం రేపుతోంది. ఈ అంశంపై విచారణ జరిపిస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు బీజేపీ నేతల పేర్లు కూడా బయటకు వస్తాయని కాంగ్రెస్ ఆరోపించడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో కోడి దాణా కుంభకోణంలో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పాత్ర ఉందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ సోమవారం ఆరోపణలు గుప్పించడం హాట్ టాపిక్‌గా మారింది. కోడి దాణా కుంభకోణంలో దాదాపు రూ.100 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. మార్క్ ఫెడ్ నుంచి మక్కలు తీసుకుని మోసం చేశారని ధ్వజమెత్తారు.

సబ్సిడీ రూపంలో తీసుకున్న మక్కలను తిరిగి ఎక్కువ రేటుకు అమ్ముకున్నారని దీని వల్ల సన్నకారు రైతులు నష్టపోయారని విమర్శించారు. ఈ కుంభకోణంలో ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రమేయం కూడా ఉందని ప్రెస్ మీట్ నిర్వహించి ఆరోపణలు గుప్పించారు. కోడి తిండిని కూడా బీఆర్ఎస్ నేతలు మింగేస్తున్నారని ధ్వజమెత్తిన ఆయన.. ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నేతల ఎర్రబెల్లి ప్రదీప్ రావులు కలిసి మక్కల కుంభకోణానికి తెరతీశారని బీహార్‌లో వెలుగు చూసిన పశువుల దాణా కుంభకోణం తరహా కోడి దాణాలో కుంభకోణం జరిగిందన్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఒక వేళ ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా ఈ కుంభకోణంతో సంబంధం ఉందని భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ఒక్క కుంభకోణంతో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కడే అని రుజువైందని ఎద్దేవా చేశారు. అసలే ఢిల్లీ లిక్కర్ స్కాంతో పాటు క్యాసినో వ్యవహారంలో బీఆర్ఎస్ తీవ్ర ఆరోణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కోడి దాణా కేసులో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి మరి.


Next Story