కర్ణాటకలోనే కాదు తెలంగాణలోనూ మా ప్రభుత్వమే!

by Disha Web Desk 2 |
కర్ణాటకలోనే కాదు తెలంగాణలోనూ మా ప్రభుత్వమే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల విజయాలతో దక్షిణ భారతదేశంలోకి తమ పార్టీ ప్రవేశించబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో శనివారం ఇండియా టుడే నిర్వహించిన 'కర్ణాటక రౌండ్ టేబుల్ 2023' ప్రోగ్రాం లో మాట్లాడిన అమిత్ షా వచ్చే నెలలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతోందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పై కర్ణాటకలో ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సామాన్యులకు మేలు చేశాయని చెప్పారు.

జేడీఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని జేడీఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు ఓటు వేయడమేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ముస్లింలకు కల్పించిన అక్రమ రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 40 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ వస్తున్న ఆరోపణలపై షా స్పందిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం మాత్రమేనని ఇందులో వాస్తవం లేనందున ఆరోపణలను నిరూపించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అవినీతిని మాపై నెట్టడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నమే ఈ 40 శాతం కమీషన్ అని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు పాలను పాలుగా నీళ్లను నీళ్లుగా వేరు చేయబోతున్నారని అన్నారు.

పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం వెనుక గుజరాత్ మోడల్ ఉందా అనే ప్రశ్నకు బదులిస్తూ బీజేపీ మార్పు, అభివృద్ధి మోడల్ ను విశ్వసిస్తుందే తప్ప గుజరాత్ మోడల్ మరో మోడల్ కాదన్నారు. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా మా పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయని పార్టీ కోసం, దేశం ప్రతిఫలం ఆశించకుండా తమ జీవితాలను సంవత్సరాల తరబడి సేవలో అంకితం చేసిన నిస్వార్థ కార్యకర్తల సైన్యం తమ పార్టీ సొంతం అన్నారు. బీజేపీ 2 స్థానాల నుంచి 300 పైగా స్థానాలకు చేరుకోవడం పార్టీ కార్యకర్తల అంకిత భావానికి నిదర్శనం అన్నారు. మాజీ సీఎం జగదీష్ షెట్టర్ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ మారినంత మాత్రాన మాకు వచ్చిన నష్టం ఏమీ లేదని షెట్టర్ తమతో కలిసినందున కాంగ్రెస్ గెలుస్తుందని వారు భావిస్తే ఆ పార్టీ ఒంటరిగా గెలవలేదని అంగీకరించినట్లే కదా అని అన్నారు.

Next Story

Most Viewed