మాజీ ఎమ్మెల్సీకు గులాబీ గాలం

by Disha Web Desk 12 |
మాజీ ఎమ్మెల్సీకు గులాబీ గాలం
X

దిశ ప్రతినిధి, నిర్మల్: మాజీ శాసన మండలి సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కారెక్కేందుకు సిద్ధమవుతున్నారా..? అంటే అవుననే ప్రచారం తూర్పు జిల్లాలో మొదలైంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి తూర్పు జిల్లా సహా పశ్చిమ ప్రాంతంలోనూ పలు నియోజకవర్గాల్లో పెద్ద దిక్కుగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో ఆయనకు తీవ్రస్థాయిలో వైరం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తనకు ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పసిగట్టిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సైతం వెనుకడబోరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ గాలం

భారత్ రాష్ట్ర సమితి పార్టీ తాజాగా ప్రేమ్ సాగర్ రావును పార్టీలో చేర్చుకునే వ్యూహంలో ఉన్నట్టు ప్రచారం మొదలైంది. గతంలో బీఆర్ఎస్ అంటే ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉండే ప్రేమ్ సాగర్ కాంగ్రెస్ పార్టీలో మారుతున్న సమీకరణల నేపథ్యంలో పరిస్థితులను బట్టి కారు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారని కూడా ప్రచారం మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు పై ఒకవైపు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం... మరోవైపు తూర్పు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోనే బలమైన నేతగా ముద్ర ఉన్న ప్రేమ్ సాగర్ తమ పార్టీలో చేరితే బహుళ ప్రయోజనాలు ఉంటాయన్న ఆలోచనతో కారు పార్టీ ఆయనకు గాలం వేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇందుకు సంబంధించి వచ్చే వారం రోజుల్లోనే ఒక నిర్ణయం జరుగుతుందని కూడా తెలిసింది. ప్రేమ్ సాగర్ తన సొంత సామాజిక వర్గం నేతలతో భారత్ రాష్ట్ర సమితి అధిష్టానం ముఖ్యనేతలతో టచ్ లోకి వెళ్లినట్లు కూడా చెబుతున్నారు. తాజా పరిణామాలు తూర్పు జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ కాగజ్నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పొలిటికల్ గ్రాఫ్ మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read More : సూర్యాపేట బీఆర్ఎస్‌లో బూత్ కమిటీల చిచ్చు!


Next Story