ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అండగా ఉంటాం : ప్రొఫెసర్ Kodandaram

by Disha Web Desk |
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అండగా ఉంటాం : ప్రొఫెసర్ Kodandaram
X

దిశ, ముధోల్ రూరల్ : బాసర ట్రిఫుల్ ఐటీ విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన ముధోల్‌లోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఎదుట నియోజకవర్గ టీజేఎస్ ఇంచార్జి సర్దార్ వినోద్ కుమార్ చేపట్టిన సమర దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రిఫుల్ ఐటీని సందర్శించడానికి వచ్చే ప్రతిపక్ష నాయకులు, పోషకులను అరెస్టు చేయడం తగదన్నారు. ట్రిఫుల్ ఐటీ మెస్ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు కళాశాలలో చేరే సమయంలో చేసే ఇన్సూరెన్స్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీలోని సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజన వసతి కల్పించాలన్నారు. పురుగులున్న అన్నాన్ని తిని విద్యార్థులు అనారోగ్యానికి గురైయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఖాళీలను భర్తీ చేయడంతో పాటు రెగ్యులర్ వీసీని నియమించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఎన్నో కలలుకని ట్రిబుల్ ఐటీలో చేరే విద్యార్థులకు సరైన వసతులు లేక ఆందోళన బాట పట్టడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం సైతం విద్య వ్యవస్థ పై నిర్లక్ష్య ధోరణి విడనాడి వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లోని సమస్యలను తెలుసుకొని త్వరలోనే హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో సైతం నెలకొన్న సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. సమస్యలపై పోరాడితేనే పరిష్కారం అవుతాయని అన్నారు.

అదే విధంగా వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. వీఆర్ఏలకు తెలంగాణ జన సమితి సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని వివరించారు. రాష్ట్రంలో వైద్య, విద్య, వ్యవసాయంపై దృష్టి పెట్టకపోతే ఆ రాష్ట్రం బాగుపడదన్నారు. ట్రిబుల్ ఐటీలో రాజకీయ నాయకుల జోక్యం తగ్గించి విద్యార్థులకు అన్ని రకాల వసతుల కల్పించే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. సమర దీక్షతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ఇంచార్జి సర్దార్ వినోద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పోరాటాలతోనే సమస్యలు సాధించే అవకాశాలు ఉంటాయని నొక్కి చెప్పారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం కోటి ఎక్స్ గ్రేషియా మంజూరు చేయడంతో పాటు కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు రావాలని అన్నారు. భావిభారత పౌరులుగా ఎదుగుతున్న సమయంలోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాలుపడడం కలచివేసిందని పేర్కొన్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించాలని చేతకాకపోతే దిగిపోవాలని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

ఇటీవలే ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పగడం ఎందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఉపాధ్యాయులు లేక విద్య వ్యవస్థ కుంటుపడుతుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలపై చూపుతున్న ప్రేమ ప్రభుత్వ విద్య సంస్థలపై చూపితే నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందన్నారు. విద్య వ్యవస్థ మెరుగుపరిచేందుకు తమ వంతుగా పోరాడుతామని వివరించారు. సమర దీక్షకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పడకండి రమాదేవి, ముధోల్ సర్పంచ్ వెంకటాపుర్ రాజేందర్ సైతం సంఘీభావం తెలిపారు. అలాగే వీఆర్ఏ సంఘం సభ్యులు సైతం మద్దతు తెలిపారు. వీఆర్ఏ సంఘం సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీజెఎస్ రైతు విభాగం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed