అక్రమ తరలింపులో అధికారుల వాటా ఎంత..?

by Disha Web Desk 20 |
అక్రమ తరలింపులో అధికారుల వాటా ఎంత..?
X

దిశ, లోకేశ్వరం: లోకేశ్వరం మండలంలోని సుద్దవాగు పరివాహక ప్రాంతం నుండి నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలి వెళ్తున్నా అడ్డుకునే వారు లేరు. దీంతో అక్రమార్కుల వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. సుద్ధ వాగు నుండి యదేచ్చగా రేయింబవళ్లు సంబంధిత అధికారుల కళ్లెదుటే ఇసుక తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అందులో అధికారుల వాటా ఎంత ఉందోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మండలంలోని ఇసుక తరలిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నది ఎవరు..?

బాహాటంగా పెద్ద మొత్తంలో ఇసుక అక్రమంగా తరలించడంలో ట్రాక్టర్ల యజమానులకు సహకరిస్తున్నది ఎవరు..? గ్రామాభివృద్ధి పేరుతో పలుగ్రామాల వీడీసీలు ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు రూపాయలు వేయి వరకు వసూలు చేస్తున్నారు. సంబంధిత అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి ఇసుక తరలింపునకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

పోలీసులు వాహనాల తనిఖీ చేసే ప్రదేశం నుండి యదేచ్చగా రవాణా..

లోకేశ్వరం పోలీసులు తరచూ మన్మధ్ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపడుతుంటారు. కాగా అదే ప్రాంతం నుండి ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నా పోలీసుల కంట పడకపోవడం శోచనీయం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై రెండు, మూడు వందల రూపాయలు ఫైన్ ఉంటే దానిని చెల్లించేంతవరకు వాహనాలను వదలని పోలీసులు నిత్యం వేలాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారిన వ్యవహారం..

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవాల్సిన మైనింగ్, పోలీస్ శాఖ వారు పట్టించుకోకపోవడంతో ఆ పనిని రెవెన్యూ శాఖ సిబ్బంది చేయాల్సి వస్తుంది. దాంతో వారికి ఇది పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. ప్రభుత్వం విఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో ఆ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. తహసిల్దార్ వీఆర్ఏలకు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే పని అప్పజెప్పడంతో వీఆర్ఏలు స్థానికులు కావడం వల్ల పరిచయాలు, ప్రజాప్రతినిధుల నుండి ఒత్తిడి రావడంతో పట్టుకున్న ట్రాక్టర్లను సైతం వదిలి పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. పలుసందర్భాల్లో తహసిల్దార్ క్షేత్రస్థాయిలో వెళ్లి ట్రాక్టర్లను పట్టుకోగానే వెంటనే ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేసి ట్రాక్టర్లను వదిలిపెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది దీనితో ట్రాక్టర్లు పట్టుకోగానే తహసిల్దార్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కలెక్టర్ ఆదేశాలు భే ఖాతరు...

ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని ఉద్దేశంతో ట్రాక్టర్ ఇసుక ట్రిప్పు కు రూపాయలు 801 వసూలు చేసి ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వాలని ఇటీవల జిల్లా కలెక్టర్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా ఈ ఆదేశాలు ఇంకా అమల్లోకి రాలేదు. ఈ విధంగానైనా ఒత్తిడి లేకుండా ఇసుకను తరలించుకోవచ్చు అని ట్రాక్టర్ల యజమానులు ఎదురు చూస్తున్నారు.

ఈనెల 12 నుండి వేబిల్లులు ఇస్తాం..(తహసిల్దార్ సరిత)

ఇసుక తరలింపు కోసం ఈనెల 12 నుండి వేబిల్లులు ఇస్తాం. ట్రాక్టర్ల యజమానులు రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించి, ఎన్ని ట్రిప్పులు ఇసుక కావాలి, ఎందుకోసం కావాలి, ఏ ట్రాక్టర్ లో తరలిస్తారు, అనే వివరాలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఒక్కొక్క ట్రిప్పుకు రూపాయలు 801 చెల్లిస్తే వే బిల్లులు అందజేస్తాం. అలాగే రెండు పడక గదుల ఇల్లు, మన ఊరు -మనబడి పనుల కోసం ఇసుక అవసరమైతే ముందుగా అనుమతి తీసుకొని ఉచితంగా తరలించుకోవచ్చు. అక్రమంగా తరలిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు.


Next Story

Most Viewed