దూకుడు పెంచనున్న ఏలేటి.. కలిసి రావాలంటూ బీజేపీ శ్రేణులకు ఫోన్

by Dishafeatures2 |
దూకుడు పెంచనున్న ఏలేటి.. కలిసి రావాలంటూ బీజేపీ శ్రేణులకు ఫోన్
X

దిశ ప్రతినిధి, నిర్మల్: అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇక రాజకీయంగా దూకుడు పెంచేందుకు యత్నాలు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్మల్ నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉండడం పలు సామాజిక వర్గాల ఓట్లు గంపగుత్తగా ఆ పార్టీకి పడతాయని అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కెందుకు మహేశ్వర్ రెడ్డి తన యత్నాలు ప్రారంభించారు.

హైదరాబాద్ తరలి ఏలేటితో పార్టీ నేతల భేటీ

బీజేపీలో చేరిన అనంతరం హైదరాబాద్ చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాజీ కాంగ్రెస్ శ్రేణులు ఆయనను వెళ్లి కలుస్తున్నారు. శనివారం సుమారు 30కి పైగా వాహనాల్లో ఆయన అనుచరులు హైదరాబాద్ వెళ్లి ఏలేటిని అభినందించారు. ఎప్పటి నుంచో బీజేపీలో చేరాలని ఆయనపై ఒత్తిడి చేస్తూ వచ్చిన నేతలు ఎట్టకేలకు కమలం గూటికి చేరిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై ఈ సందర్భంగా ఆయనతో చర్చించినట్లు పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. త్వరలోనే పాత కొత్త నేతలు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుందామని ఈ సందర్భంగా వారితో చెప్పినట్లు తెలిపారు.

సీనియర్ బీజేపీ శ్రేణులకు ఫోన్ చేసిన ఏలేటి..

బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గం ముఖ్య నేతలందరికీ హైదరాబాదు నుంచి ఫోన్ చేసి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాను అభ్యర్థిగా బరిలో ఉంటానని తన చేరిక సందర్భంగా అధిష్టానం హామీ ఇచ్చిందని ఆయన నేతలతో పేర్కొన్నారు. మెజారిటీ నేతలు ఆయన పార్టీలో చేరడాన్ని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. విభేదాలు పక్కనబెట్టి పార్టీ గెలుపు కోసం పని చేద్దామని కొందరు చెప్పగా మరికొందరు నేతలు అన్యమనస్కంగా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఒకరిద్దరి నేతలు ఏలేటి తో ఫోన్లో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయనట్లు కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. గతంలో బీజేపీలో చేరి ఆ తరువాత భారత్ రాష్ట్ర సమితికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తితో బీజేపీలోకి వచ్చిన ఓ నేత మాత్రం తాజా పరిణామాలపై అలక వహించినట్లు చెబుతున్నారు

19న నిర్మల్ రాక..

ఇదిలా ఉండగా ముహూర్త బలం చూసుకుని మహేశ్వర్ రెడ్డి ఈనెల 19న నిర్మల్ వస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. బుధవారం హైదరాబాదు నుంచి నేరుగా నిర్మల్ రానున్నారు. కొండాపూర్ బైపాస్ వద్ద నుంచి భారీగా ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తనతో కలిసి పని చేసిన కాంగ్రెస్ శ్రేణులతో పాటు బీజేపీ నేతలు అందరినీ ఈ ర్యాలీకి ఆహ్వానిస్తున్నారు.



Next Story

Most Viewed