కడెం కాలువలు అన్యాక్రాంతం..

by Disha Web Desk 20 |
కడెం కాలువలు అన్యాక్రాంతం..
X

దిశ, మంచిర్యాల : కడెం కాల్వలు అన్యా క్రాంతమవుతున్నాయి. కాల్వ పక్కన స్థలాలకు రూ. కోట్లల్లో ధర పలుకుతుండడంతో రియల్టర్లు, బడా బాబులు కాల్వలను పూడ్చి మరీ ఆక్రమిస్తున్నారు. ఎక్కడైనా కాల్వ ఆక్రమణకు గురైందని ఫిర్యాదులు వెళ్తేనే సంబంధిత నీటిపారుదల శాఖ అధికారుల్లో చలనం వస్తోంది. అంతే తప్ప కాల్వల ఆక్రమణ లపై పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాల్వలు ఆక్రమణకు గురైన ప్రాంతంలో సాగునీరందక రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఆక్రమణల్లో బడా బాబులు..

కడెం ప్రాజెక్టు ప్రధాన కాల్వ నిర్మల్ జిల్లాలోని కడెం నుంచి దస్తురాబాద్, జన్నారం మండలాల మీదుగా మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం వరకు 73 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. ప్రాజెక్టు కు దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలు చివరి ఆయకట్టు కిందికి వస్తాయి. హాజీపూర్ మండలంలోని కడెం ప్రధాన కాల్వ డి-42 కి ఉన్న ఎస్-8, ఎస్-9, 10, ఎస్-11, ఎస్-12 ఉన్నాయి. వాటిలో ఎస్ -11,12 కాల్వలు ఆక్రమణదారుల చర్యలతో పూడుకుపోగా ఆనవాళ్లు లేకుండా పోయాయి. కొందరు తమ భూముల పక్కన ఉన్న కాల్వ స్థలాన్ని ఆక్రమించి తమ భూముల్లో కలుపుపేసు కోగా, మరికొందరు కాల్వ స్థలాల్లో పెద్ద పెద్ద ఇళ్లు, భవంతులు నిర్మించుకున్నారు. జాతీయ రహదారి పక్కన ఎస్-8 కాల్వకట్టను ఆక్రమించి ఓ సిరామిక్స్ వ్యాపారవేత్త ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు.

ఎస్-10 కాల్వ జాతీయ రహదారి పక్కన ఆక్రమణలతో పూడుకుపోయి ఆనవాళ్లు లేకుండా చేశారు. జాతీయ రహదారి పక్కన మంచిర్యాలకు చెందిన ఓ వ్యాపార వేత్త తన భూమి మధ్యలో నుంచి వెళుతున్న ఈ కాల్వను ఆక్రమించాడు. ఆక్రమించిన కాల్వ స్థలం సుమారు అర ఎకరం వరకైనా ఉంటుందని తెలుస్తోంది. దాని ధర రూ. అర కోటికి పైగానే పలుకుతుంది. చుట్టూ ప్రహరీ సైతం ఏర్పాటు చేశాడు. దీనిపై రైతుల నుంచి నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో స్పందించిన అధికారులు కాల్వ స్థలానికి హద్దు రాళ్లు పాతారు. కానీ పూడ్చిన కాల్వ నుంచి మట్టి మాత్రం తీయించలేదు. కాగా 63వ నెంబర్ జాతీయ రహదారిని దాటి ఈ కాల్వ గుండా గుడిపేట చెరువులోకి సాగునీరు వెళ్లాల్సి ఉంది. కానీ కాల్వ అక్రమణ లతో పూడుకు పోవడంతో సాగునీరు అందడం కష్టమేనని రైతులు వాపోతున్నారు.

ఎస్- 11, ఎస్-12 కాల్వ లు ఆక్రమణ లతో ఆనవాళ్లే దొరకని పరిస్థితి. ఈ కాల్వలు ఆక్రమణలతో పరుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. కొందరు ఆక్రమణదారులు తమ పంట భూముల్లో కలిపేసుకోగా, మరికొందరు పూడుకుపోయిన కాల్వలను కబ్జా చేసి పెద్ద పెద్ద ఇళ్లు, భవంతులు నిర్మించుకున్నారు. మంచిర్యాలకు చెందిన ఓ రాజకీయ నాయకుడు తన భూమి పక్కనుంచి వెళ్లే ఎస్-11 కాల్వ స్థలాన్ని కొంత ఆక్రమించారు. ప్రహరీ నిర్మించి గేటు ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. లక్షెట్టిపేట పురపాలక సంఘ పరిధిలోని గంపలపల్లి పాల శీతలీ కరణ కేంద్రం వద్ద ఓ రాజకీయ పార్టీ నాయకుడు డి- 37 కాల్వ స్థలాన్ని ఆక్రమించాడు. ఏడాది కిందట పట్టణ ప్రగతి నిధులతో ఆ స్థలం గుండా రైతులకు దారి వేసేందుకు ఆ ప్రాంత కౌన్సిలర్ ప్రయత్నించగా, దాన్ని అడ్డుకొని వివాదానికి తెర లేపాడు. దీంతో ఆ పనులు నిలిచి పోయాయి.

రహదారి వెంట ఆనవాళ్లు కోల్పోయిన కాల్వ లు...

లక్షెట్టిపేట నుంచి మంచిర్యాలకు వెళ్లే 63వ నెంబరు జాతీయ రహదారి వెంట భూములకు ఎకరానికి రూ.కోటి రూ.కోటి న్నర వరకు ధర పలుకుతోంది. రహధారి వెంట కడెం కాల్వలు ఉండటంతో వాటిని ఆక్రమణదారులు, రియల్టర్లు వదలడం లేదు. ఆక్రమించి తమ భూముల్లో, వెంచర్లలో కలిపేసుకుంటున్నారు. పిల్ల కాల్వ లుగా పిలవబడే "ఎస్" కాల్వలకు రెండు వైపులా గట్ల మీదుగా 11 ఫీట్ల వెడల్పు తో దారులు ఉండాలి. అదే ఉపకాల్వలకు రెండువైపులా 33 ఫీట్ల వెడల్పు చొప్పున, అదే ప్రధాన కాల్వ కు రెండు వైపులా 100 ఫీట్ల కి పైగా వెడల్పుతో దారులు ఉండాలి. అయితే ఆ కాల్వ లకు ఆక్రమణ లతో చాలాచోట్ల ఆ మేరకు దారులు ఉండటం లేదు. ఆక్రమణ లతో చాలా చోట్ల కాల్వ లపై దారులు మూసేస్తుండటంతో పంట పొలాలకు వెళ్లలేక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Next Story

Most Viewed