మోదీకి రాహుల్ భయం పట్టుకుంది : సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క

by Disha Web Desk 20 |
మోదీకి రాహుల్ భయం పట్టుకుంది : సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క
X

దిశ, తాండూర్ : 2024 ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి పార్టీ అధినేత, ఏఐసీసీ మాజీ చీప్ రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతాడనే భయం మోదీకి పట్టుకుందన్నారు. సూరత్ కోర్టు తీర్పును సాకుగా చూపి సభాపతి చేత లోక్ సభ సభ్యత్వానికి మోదీ, అమిత్ షా అనర్హత వేటు వేయించారని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత (సీసెల్ఫీ) నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ బస శిబిరం వద్ద శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ కు సూరత్ కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన్నప్పటికి హైకోర్టుకు వెళ్లడానికి 30 రోజులు గడువు ఉన్న బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకోకుండా ఆగమేఘాల మీద సభ్యత్వం రద్దు చేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధమన్నారు.

లోక్ సభస్పీకర్ కు ఒక సభ్యుడిని చట్టసభల నుంచి బహిష్కరించడం, సస్పెండ్ చేయడం విచక్షణ అధికారమైనప్పటికీ, ఆ విచక్షణ అధికారం భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలని, కేవలం కక్ష సాధింపు చర్యగా ఉండకూడదన్నారు. ప్రతిపక్షాలను అణిచివేయడం నియంతృత్వ పోకడలు అవలంబించే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పిన చరిత్ర దేశప్రజలకు ఉందన్నారు. రాహుల్ గాంధీ వేటుపై ఎఐసీసీ సోమవారం నుంచి దేశవ్యాప్త ఆందోళన చేపట్టేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించిందన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దలను కాపాడేందుకే సిట్ ప్రతిపక్ష నేతలకు విచారణ పేరిట నోటీసులు జారీ చేసిందన్నారు.

ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి కానీ బ్యూరోక్రసీలు, సివిల్ సర్వెంట్స్ భారత రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి నడుచుకోవాలని సూచించారు. దేశంలోని ప్రజాస్వామాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్తకంఠంతో ఖండించి రాహుల్ కు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. పేపర్ల లీకేజీల పట్ల విద్యార్థులు మనోస్థైర్యం కోల్పోవద్దని ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ కొనసాగించాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్రావు, ఆసిఫాబాద్, మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, కొక్కిరాల సురేఖ, నాయకులు గణేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed