ఒంటికి..రెంటికి ఇబ్బందే!

by Disha Web Desk 20 |
ఒంటికి..రెంటికి ఇబ్బందే!
X

దిశ, మంచిర్యాల : వ్యవసాయాభివృద్ధి కోసం నిర్మించిన రైతు వేదికల్లో నీటికష్టాలు తప్పడం లేదు. నీటి సమస్యతో రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాలకు వచ్చే రైతులు, అధికారులు ప్రజాప్రతినిధులు తాగునీటికి, ఒంటికి, రెంటికి ఇబ్బందులు పడాల్సివస్తోంది. మంచిర్యాల జిల్లాలో 55 రైతు వేదికలు ఉండగా, అందులో 28 వేదికల్లో నీటి సమస్య నెలకొని ఉంది. దీనికితోడు పలువేదికలకు ప్రహరీలు సైతం లేకపోవడంతో వాటి ఆవరణలు మందుబాబులు అడ్డాలుగా మారుతున్నాయి. ఈ అసౌకర్యాలతో పడుతున్న ఇబ్బందులను వ్యవసాయ అధికారులు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదు.

ఇదీ పరిస్థితి..

రైతులను ఒకే వేదిక మీదకు చేర్చి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించింది. ప్రతి మండలంలో 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా విభజించి ఒక్కొక్క వేదిక నిర్మాణానికి రూ. 22 లక్షలు వెచ్చించింది. ఒక్కొక్క రైతు వేదికకు ఒక ఏఈవో (వ్యవసాయ విస్తరణ అధికారి)ని నియమించింది. ప్రతి వారంలో రెండు రోజులు రైతులు, ప్రజా ప్రతినిధులతో ఏఈవో సమావేశం ఏర్పాటు చేసి పంటల సాగు, దిగుబడులు సాధించే పద్ధతులపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆశయం బాగానే ఉన్నా.. రైతు వేదికల్లో నీటి సమస్య ఇబ్బందులు సృష్టిస్తోంది. తాగునీరు, టాయిలెట్ల (మూత్రశాలలు, మరుగుదొడ్లు)లకు నీటి సరఫరా లేక రైతు వేదికలకు వచ్చి సమావేశమయ్యే రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఒంటికి రెంటికి ఇబ్బందులు పడాల్సివస్తోంది. కొన్ని వేదికలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా కనెక్షన్ ఇచ్చినా స్టోరేజీ ట్యాంక్ లకు ఎక్కడ లేదు. అక్కడ అధ్యయనం చేసి లోపం గుర్తించి నీటి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఆ మేరకు ప్రయత్నించకపోవడం కూడా శాపంగా మారింది. నీటి సరఫరా సమస్యతో పలు రైతు వేదికల్లోని టాయిలెట్లు అపరిశుభ్రంగా తయారై కంపు కొడుతున్నాయి.

లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట, లక్షెట్టిపేట పురపాలక సంఘంలోని రైతు వేదికలకు నీటి సమస్య ఉంది. మున్సిపాలిటీ లక్షెట్టిపేట పురపాలక సంఘం రైతువేదికలో మిషన్ భగీరథ కనెక్షన్ ఉన్నా ట్యాంక్ లోకి నీరు చేరడం లేదు. ఈ రైతు వేదికలోని టాయిలెట్లు నీటిసరఫరా సమస్యతో అపరిశుభ్రంగా మారి కంపు కొడుతున్నాయి. ఇక్కడ నీటి సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ అధికారులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. వెంకట్రావుపేటలో బోరు ఏర్పాటుచేసినా ఇప్పటికీ కనెక్షన్ ఇవ్వలేదు. జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామ రైతు వేదికలో నీటిసరఫరాకి ఎలాంటి ఏర్పాటు లేకపోవడంతో ఇప్పటికీ నీటి ట్యాంక్ ను అమర్చలేదు. జైపూర్ మండలంలోని జైపూర్, కిష్టాపూర్, కోటపల్లి మండలంలోని కోటపల్లి, దేవులవాడ, మల్లంపేట, సిర్సా గ్రామ రైతు వేదికల్లోనూ నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. భీమిని రైతు వేదికలో మంచినీటి సరఫరా లేక వేదికకు పక్కన ఉన్న మండల విద్యా వనరుల కేంద్రంకు ఉన్న బోరు నుంచి నీటిని వాడుకుంటున్నారు.

కాసీపేట మండలంలోని కాసీపేట, ధర్మరావుపేట రైతు వేదికలకూ నీటి సరఫరా లేదు.

మందమర్రి పురపాలక సంఘంలోని రైతు వేదికలోనూ అదే పరిస్థితి. జిల్లాలోని 60శాతం రైతు వేదికలకు ప్రహరీలు సైతం లేకపోవడంతో వాటి ఆవరణలో రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి.

సగానికి పైగా వారే..

జిల్లాలోని 55 మంది ఏఈవోల్లో 30 మంది మహిళలే ఉన్నారు. నీటి సమస్య ఉన్న 28 రైతు వేదికల్లో సగం మందికి పైగా వారే పనిచేస్తున్నారు. నీటి సమస్యతో మహిళా అధికారులు ఇబ్బంది పడటమే కాకుండా సమావేశాలకు వచ్చే రైతులు, ప్రజాప్రతినిధులు, నానా తంటాలు పడాల్సి వస్తోంది. నీటి సమస్యపై ఎవరైనా ప్రశ్నిస్తే ఏఈవోలు వారికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికైనా రైతు వేదికలో ఉన్న అసౌకర్యాలపై పాలకులు, ఉన్నతాధికారులు దృష్టిసారించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



Next Story

Most Viewed