ఉమ్మడి మెదక్‌లో అధ్వాన్నంగా కాంగ్రెస్ పరిస్థితి.. కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి!

by Disha Web Desk 2 |
ఉమ్మడి మెదక్‌లో అధ్వాన్నంగా కాంగ్రెస్ పరిస్థితి.. కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి!
X

పార్టీని ముందుండి నడిపించాల్సిన సీనియర్లే ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. ఒకరికి ఒకరు ఎడమొహం.. పెడమొహం. స్థానికంగా ఉండరు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కలవరు. ఎప్పుడో ఓ సారి అలా గాంధీభవన్ వద్ద కనిపిస్తుంటారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలపై ఆసక్తి చూపించరు. అంతా పట్నంలో ఉండి నడిపిస్తుంటారు. అధికారంలో ఉండగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారు ఇప్పుడు పట్టీపట్టనట్లు ఉండడాన్ని చూసి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజు రోజుకూ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. రాహుల్ జోడో యాత్ర నేపథ్యంలో ఓ వారం రోజులు కనిపించిన ఉత్సాహం ఇప్పుడు లేదు. ఆ ఉత్సాహాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాల్సిన నేతలు గ్రూపులు, పార్టీలో పదవుల కోసం వ్యూహాలతోనే గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన పార్టీ ఇప్పుడు పునాదులు కదిలే స్థాయికి వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది. రాష్ట్రంలో పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఇక్కడి నుంచే ఉన్నప్పటికీ పార్టీ పరిస్థితి మాత్రం ఏ మాత్రం బాగాలేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిస్థితి ఇలాగే ఉంటే కాంగ్రెస్ ను ఊహించుకోలేమంటున్నారు ఆ పార్టీ అభిమానులు.

దిశ, సంగారెడ్డి బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులున్నారు. అందోలు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, జహీరాబాద్ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి, నారాయనఖేడ్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి లు పనిచేస్తున్నారు. జగ్గారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక పటాన్ చెరు, గజ్వేల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్ లలో నాయకులు పనిచేస్తున్నప్పటికీ అంత ప్రభావితం చేసేవారు కాదని చెప్పుకోవచ్చే. అయితే ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్లు అనుకునేవారే పార్టీ కోసం అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదనే ఆరోపణలు సొంత పార్టీ కార్యకర్తలే చేస్తున్నారు. సీనియర్లు ఎవరు కూడా స్థానికంగా ఉండడం లేదు. అంతే కాకుండా రాజనరసింహ, గీతారెడ్డి, జగ్గారెడ్డి, సురేష్ షెట్కార్ వంటి నేతలు సింపుల్ గా గ్రామీణ స్థాయి కార్యకర్తలు, నాయకులకు దొరికేవారు కారు. వాళ్లు ఉన్నచోటకు వెళ్లినా కలుసుకునే పరిస్థితి ఉండదంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీరియస్ గా వ్యూహరచణ చేస్తున్నట్లుగా బిజీ బిజీగా ఉంటారు. అంటే అందుబాటులో ఉండరు...ఎవరికి దొరకరన్నట్లు. ఫోన్లను కూడా వీరితో మాట్లాడడం కష్టమేనని పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది.

ఎడమొహం.. పెడమొహం

ఉమ్మడి జిల్లాలో సీనియర్లుగా ఉన్న రాజనరసింహ, గీతారెడ్డి, జగ్గారెడ్డి, సురేష్ షెట్కార్ ల మద్య అందరిలో ఐక్యత లేదు. ఒకరంటే ఒకరికి పడదు. వీరిలో ఎవరితో కొంచం సేపు మాట్లాడినా మిగతా వారిపై ఆరోపణలు చేస్తుంటారు. పార్టీ ఆగం కావడానికి కారణం ఒకరంటే..ఒకరని వారిలో వారే కార్యకర్తల ముందు నిందలు వేసుకుంటారు. ఉమ్మడి జిల్లా పార్టీ బాగు కోసం అందరూ కూర్చుండి ఉత్సాహంగా చర్చించిన సందర్బాల్లో ఈ మద్య కాలంలో తక్కువే. హైదరాబాద్ కే పరిమితం అయ్యే వీరు ఎప్పుడో అప్పుడు అలాగా నియోజకవర్గాలకు వచ్చిపోతుంటారు. పార్టీలో కోవర్టులున్నారంటూ ఇటీవల దామోదర రాజనరసింహ మీడియా ముఖంగా ఆరోపణలు చేయడం పెద్ద దుమారమే లేపిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని ఉద్యేశించి ఆయన ఈ వ్యాఖ్యాలు చేసినట్లు గుర్తించిన పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఇంత జరిగితే సీనియర్లుగా చెప్పుకునే గీతారెడ్డి, జగ్గారెడ్డి, సురేష్ షెట్కార్ లాంటి వారు ఈ వ్యవహారంలో తలదూర్చకపోవడం గమనార్హం. సమస్యను సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించే వారే లేకుండా పోయినట్లు ఆ ఘటన నిదర్శనంగా నిలిచింది.

కనిపించని పార్టీ కార్యక్రమాలు..

పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనితో సీనియర్లు రోజుల తరబడి నగరంలోనే ఉంటూ వ్యహరచణలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు కూడా సీనియర్ల నియోకవర్గాల్లో పెద్దగా జరగలేదు. ఏదో చేసినమా అంటే చేసినట్లు స్థానిక లీడర్లు మమా అనిపించారు. నేతలు అలా ఎప్పుడో వచ్చి మీడియాకు కనిపించి పోయారు. గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు లేకపోవడం, తమ నేతలు స్థానికంగా కనిపించకపోవడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు అధికార టీఆర్ ఎస్ పార్టీలో మంత్రులతో సహా ఎంపీ, ఎమ్మెల్యేలు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఊర్లకు దూరం కావడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ కూడా వివిద రకాలుగా కార్యక్రమాలు చేపడుతూ గ్రామీణ స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిశితంగా గమణిస్తున్న పార్టీ కార్యకర్తలు సీనియర్లతో పార్టీకి నష్టం జరుగుతుందనే భావనకు వస్తున్నది. రాహుల్ జోడా యాత్రతో వచ్చిన కొంత ఉత్సాహం వారం రోజులు కూడా మిగలలేదని, రాష్ట్ర పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో మళ్లీ అంతా సైలెంట్ అయిపోయిందని కార్యకర్తలు తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ బలపడేనా..?

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పుర్వవైభవం వస్తుందా..? అని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్లోనే సవాలక్ష అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ సీనియర్ల ఏకం అవుతారా..? తమల్ని ముందుకు నడిపిస్తారా..? అనే చర్చలు జరుగుతున్నాయి. సీనియర్లను పక్కన పెడితే పటాన్ చెరులో గాలి అనిల్​ కుమార్​, కాట శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి, నారాయణఖేడ్ లో పట్లోళ్ల సంజీవరెడ్డి, నర్సాపూర్ లో గాలి అనిల్​ కుమార్​, ఆంజనేయులు, ఆవుల రాజిరెడ్డి, రవిందర్ రెడ్డి, గజ్వేల్ లో నర్సారెడ్డి, మెదక్ లో కంఠారెడ్డి తిరుపతి రెడ్డి వంటి వారు స్థానికంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మల్యే జగ్గారెడ్డి కూడా పండుగలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటు కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తుంటారు. జగ్గారెడ్డి సతీమణి నిర్మల, కూతుర జయారెడ్డి లు కూడా స్థానికంగా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా కాంగ్రెస్ లో సీనియర్లు ఏకమై ఉమ్మడి మెదక్ పార్టీ బలోపేతానికి నడం కడతారా..? ఇంకా ఇలాగే వ్యూహరచనలే చేస్తుంటారా..? అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కు మంచి రోజులొస్తాయా..? పార్టీ బలోపేతం కానుందా..? మరింత ఆగం కానున్నదో వేచి చూడాల్సి ఉన్నది.

Also Read....

అదే అంబేద్కర్‌కు నిజమైన నివాళి: రేవంత్ రెడ్డి


Next Story

Most Viewed