ఎంసెట్‌కు భారీగా పెరిగిన దరఖాస్తులు..

by Disha Web Desk 13 |
ఎంసెట్‌కు భారీగా పెరిగిన దరఖాస్తులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్ కు 3.20,587 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ఎంసెట్ కు 53,873 మంది అప్లికేషన్లు అదనంగా వచ్చినట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు తెలంగాణో 104 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్ లో 33 కేంద్రాలు మొత్తం 137 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు స్పష్టంచేశారు. ఇందులో 28 కొత్త కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.

నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఆయన తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు లింబాద్రి తెలిపారు. ఎంసెట్ కు సంబంధించి ఇప్పటికే 2 లక్షలకు పైగా విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు.

ఇదిలా ఉండగా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు అంశం ప్రాసెస్ లో ఉందని, అప్పటి వరకు ఆ యూనివర్సిటీలను కాలేజీలుగానే గుర్తిస్తామని లింబాద్రి స్పష్టంచేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకే వర్సిటీలుగా గుర్తిస్తామన్నారు. ఆ యూనివర్సిటీలకు కన్వీనర్ కోటాలో విద్యార్థులను కేటాయించలేదనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఆ కాలేజీలు చేసుకున్న అడ్మిషన్లకు, ఉన్నత విద్యా మండలికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ సారి ప్రతి సెంటర్లో సిట్టింగ్ అబ్జర్వర్స్ ఉంటారన్నారు. ఎగ్జామ్ సెంటర్ ఉన్న రూట్లో ఎక్కువ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ని ఇప్పటికే కోరినట్లు లింబాద్రి తెలిపారు.

ఇదిలా ఉండగా 2023-24 విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రంలో నిర్వహించే యూజీ, పీజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహణపై లింబాద్రి క్లారిటీ ఇచ్చారు. ఎంసెట్ ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎడ్ సెట్ ను ఈనెల 18వ తేదీన, ఈసెట్ ఈనెల 20, లాసెట్ ఈనెల 25, ఐసెట్ ఈనెల 26, 27 తేదీల్లో, పీజీఈసెట్ ఈనెల 29వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు లింబాద్రి వెల్లడించారు. అనంతరం జేఎన్ టీయూ వీసీ కట్టా నర్సింహ రెడ్డి మాట్లాడుతూ.. ఏ విద్యాసంవత్సరం తమ వర్సిటీలో కొత్తగా బయో టెక్నాలజీ కోర్సును అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ గా దీన్ని ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. కొత్త కోర్సుల కోసం ప్రైవేట్ కాలేజీల దరఖాస్తులు ఏఐసీటీఈ వద్ద పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.

ఎంసెట్ అప్లికేషన్ వివరాలు..

విభాగం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం

ఇంజినీరింగ్: 1,53,841 51,454 2,05,295

అగ్రికల్చర్, మెడికల్: 94,551 20,741 1,15,292

మొత్తం: 2,48,392 72,195 3,20,587


Next Story