మణిపూర్ నుంచి 2 విడతల్లో వచ్చిన విద్యార్థులు.. స్వగ్రామాలకు తరలింపు

by Dishafeatures2 |
మణిపూర్ నుంచి 2 విడతల్లో వచ్చిన విద్యార్థులు.. స్వగ్రామాలకు తరలింపు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మణిపూర్​లో చిక్కుకుపోయిన 106 మంది విద్యార్థులు సోమవారం రెండు విడతల్లో హైదరాబాద్ ​చేరుకున్నారు. వీరితో పాటు నిర్మల్​జిల్లా భైంసాకు చెందిన దంపతులు.. వారి ఒక నెల వయసున్న కూతురుని కూడా సురక్షితంగా ఇక్కడకు తీసుకొచ్చారు. మొదట 72 మంది విద్యార్థులతో ఇండిగో విమానం మధ్యాహ్నం 2గంటలకు చేరుకోగా సాయంత్రం మరో ఫ్లైట్​ 34మంది విద్యార్థులతో పాటు బేగంపేట ఎయిర్​పోర్టులో ల్యాండ్​ అయ్యింది. విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి, రాజేంద్రనగర్ ​ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, అదనపు డీజీలు మహేశ్​భగవత్, అభిలాష బిస్త్, డీఐజీ సుమతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హరీష్, ప్రొటోకాల్​ డైరెక్టర్​ అరవింద్​సింగ్ ​స్వాగతం పలికారు. సిద్ధం చేసి పెట్టిన బస్సుల్లో విద్యార్థులను మహాత్మాగాంధీ, జూబ్లీహిల్స్​ బస్​స్టేషన్లకు తరలించారు. అక్కడి నుంచి వారి వారి స్వస్థలాలకు పంపించారు. ఆరోగ్యం సరిగ్గా లేనివారిని కార్లలో వారి వారి సొంత ఊర్లకు తరలించారు.

రిజర్వేషన్ల విషయమై తలెత్తిన వివాదం మణిపూర్​లో తీవ్ర హింసాత్మక ఘటనలకు దారి తీసిన విషయం తెలిసిందే. అల్లరిమూకలు విచక్షణారహితంగా జరిపిన దాడుల్లో యాభై మందికి పైగా మరణించారు. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దాంతో పరిస్థితి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసేవరకు వెళ్లింది. కాగా, తెలంగాణ ప్రాంతానికి చెంది మణిపూర్​లోని వేర్వేరు విద్యాసంస్థల్లో నిట్, ఐఐఐటీ, జేఐఎంఎస్, మణిపూర్​వ్యవసాయ వర్సిటీలో చదువుకుంటున్నవారు అక్కడే చిక్కుకుపోయారు. క్యాంపస్​ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక..సరైన భోజనం చివరకు మంచినీళ్లు కూడా అందక నానా అగచాట్లు పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రలు తమ తమ పిల్లలను సురక్షితంగా తీసుకు రావటానికి చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. వీటిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్​వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్​మణిపూర్​ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన విద్యార్థుల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతోపాటు డీజీపీ అంజనీ కుమార్​పోలీసు ఉన్నతాధికారులతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 24గంటలపాటు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు.

ప్రత్యేక విమానాల్లో తరలింపు..

తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులను తరలించటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా మణిపూర్​ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం రావటంతో ఇక్కడి ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక విమానాలను అక్కడికి పంపించింది. ఇండిగోకు చెందిన మొదటి విమానం డెబ్భయి రెండు మంది విద్యార్థులు, పౌరులతో అక్కడి నుంచి బయల్దేరి సోమవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో శంషాబాద్​అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. మరో ముప్పయి నాలుగు మంది విద్యార్థులతో రెండో విమానం కోల్​కతా మీదుగా సోమవారం రాత్రికి శంషాబాద్​ఎయిర్​పోర్టుకు వచ్చింది. అప్పటికే అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ తమ పిల్లలను చూడగానే దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. కొంతమంది సంతోషాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పట్టుకున్నారు. కాగా, ఇక్కడికి చేరుకున్న విద్యార్థులకు రాజకీయ నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో వీరిని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్​స్టేషన్లకు తరలించి అక్కడి ఉంచి వారి వారి స్వగ్రామాలకు పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వం, అధికారులకు కృతజ్ఞతలు తెలియచేశారు.

క్షణ క్షణం.. భయం భయం..

మణిపూర్​లో హింసాత్మక ఘటనలు చెలరేగిన తరువాత క్షణ క్షణం భయంగానే గడిపామని అక్కడి నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు తెలిపారు. గడిచిన అయిదు రోజులుగా ఇంటర్నెట్​పనిచేయలేదని చెప్పారు. ఆహారం కూడా దొరకక పస్తలున్నట్టు తెలిపారు. ఇంఫాల్​వర్సిటీ సమీపంలోనే బాంబు పేలుళ్లు జరిగాయని, ఆ శబ్ధాలు విని తీవ్ర భయాందోళనలకు గురైనట్టు వివరించారు. అల్లరిమూకలు తాగు నీళ్లలో విషం కలపాలని ప్రయత్నించినట్టు తెలిపారు. అయితే, తాము చదువుకుంటున్న విద్యా సంస్థల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు పెద్ద సంఖ్యలో భద్రతా విధుల్లో ఉండటంతో సురక్షితంగా ఉండగలిగామన్నారు.

Next Story

Most Viewed