100 ఎకరాలు ప్రైవేటు పరం?

by Disha Web Desk 4 |
100 ఎకరాలు ప్రైవేటు పరం?
X

అత్యంత విలువైన ప్రాంతంలో వంద ఎకరాల ప్రభుత్వ భూమిపై పెద్దలు నజర్ వేశారు. రూ.2వేల కోట్ల విలువ చేసే భూమిని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ధరణి పోర్టల్, ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లో అది ప్రభుత్వ భూమిగానే కనిపిస్తున్నా.. త్వరలో దీన్ని ప్రయివేటుగా మార్చనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నది. అధికారులను అడిగితే ఎలాంటి సమాధానం రావడం లేదు. కూకట్‌పల్లి మండలం శంషీగూడ సర్వే నెంబర్ 57లో వంద ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్‌లో జరుగుతున్న భూ దందాపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : అది పక్కాగా ప్రభుత్వ భూమి. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి లెక్క పక్కా. కానీ రెండు వర్గాలు ఎవరికి వారు ఆ భూములు తమవేనంటూ న్యాయస్థానానికి వెళ్లాయి. రెవెన్యూ శాఖతో సంబంధం లేకుండానే ఓ వర్గం హక్కులు సాధించింది. ఆ తర్వాత కూడా 50 ఏళ్లు మౌనం వహించారు. ఆ సమయంలో హుడా లేఅవుట్లు చేసింది. ప్లాట్లు చేసి అమ్మేసింది. పేదలకు ఇళ్ల స్థలాలిచ్చింది. కాలనీలు వెలిశాయి. ప్రభుత్వ సంస్థలకూ భవనాలు నిర్మించారు.

కానీ ఇప్పుడు 1959 నాటి ప్రిలిమినరి డిక్రీతో తామే యజమానులం అంటూ కొందరు భూ దందాకు తెరలేపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల అండదండలతో రియల్టర్ల భూ పందేరం యథేచ్ఛగా సాగుతున్నది. రెవెన్యూ రికార్డులు, పీఓబీ జాబితాలో మార్పులు లేకపోయినా, రిజిస్ట్రేషన్లు మాత్రం సాగుతున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇప్పుడేమో మిగిలిన రూ.2 వేల కోట్ల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ (పొరంబోకు) భూమిని పట్టాగా మార్చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది. మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి మండలం శంషీగూడ సర్వే నం.57పై అధికారులెవరూ స్పష్టతనివ్వడం లేదు.

అది పొరంబోకు..

కూకట్‌పల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెం.1 నుంచి 274 వరకు ఉండేవి. ఆవాస గ్రామంగా శంషీగూడ ఉండేది. సర్వే నెం.274లోని 274.33 ఎకరాలు పొరంబోకు భూమి(సర్కారీ)గా రికార్డుల్లో ఉన్నది. శంషీగూడను సపరేట్ రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేశారు. 1 నుంచి 205 వరకు కూకట్‌పల్లికి, 206 నుంచి 274 వరకు శంషీగూడకు కేటాయించారు. శంషీగూడకు వచ్చిన మొత్తం సర్వే నెంబర్ల సంఖ్య 68. కానీ ఒకటి నుంచి పరిగణిస్తూ 57 వరకే లెక్కించారు. మిగిలిన 11 సర్వే నంబర్లకు చెందిన భూమి ఎలా సర్దుబాటు చేశారో నేటికీ అంతు చిక్కని అంశమే.

సమాచార హక్కు చట్టం కింద అడిగినా రెవెన్యూ వర్గాల నుంచి సమాధానం లేదు. అయితే సర్వే నెం.274లోని ప్రభుత్వ భూమి/పొరంబోకు శంషీగూడ రెవెన్యూకు మారిన తర్వాత సర్వే నెం.57గా మారింది. నేటికీ ప్రభుత్వ భూమిగానే అందరికి తెలుసు. ‘మా తాతల కాలం నుంచి ఈ భూములను సాగు చేశాం. ఐతే పట్టాలు లేకపోవడంతో హక్కులు సాధించలేకపోయాం. మా దగ్గర శిస్తు కట్టిన రశీదులు కూడా ఉన్నాయి’ అని పాతతరం అంటున్నది. కానీ 2000 సంవత్సరం నుంచి ప్రైవేటు వ్యక్తులు తమదంటూ వస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికైతే ధరణి పోర్టల్, ఐజీఆర్ఎస్ వెబ్ సైట్ లో సర్వే నం.57 ప్రభుత్వ భూమిగానే ఉన్నది. కానీ త్వరలోనే పట్టాగా మారనుందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారులను అడిగితే సమాధానం చెప్పకుండా దాటవేస్తుండడం గమనార్హం.

అప్పుడు చెక్.. ఇప్పుడేమో!

తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ భూముల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించారు. శంషీగూడ భూములను కాపాడేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమంగా, రికార్డులను పరిశీలించకుండా చేసిన రెండు మ్యుటేషన్లను రద్దు చేయాలంటూ లేఖ నెం.బి/1568/2014, తేదీ.10-12-2014 ద్వారా కలెక్టర్‌కు బాలానగర్‌ డిప్యూటీ కలెక్టర్‌ ప్రతిపాదనలు పంపారు. వాటిని రద్దు చేయకపోతే మిగిలిన భూములను కాపాడలేమన్న వాదననూ అధికారులు వినిపించారు. సీఎస్7, 14/1959లపై అప్పటి ఆర్డీఓ సురేశ్ పొద్దార్ చైర్మన్‌గా సరూర్‌నగర్‌, బాలానగర్‌, శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్లు, శంషాబాద్‌ తహశీల్దార్లు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. ఏమేం కేసులు ఉన్నాయి? ప్రభుత్వ వాదన ఏమిటి? తదితర అంశాలతో సమర్పించిన నివేదికను ఎంత వరకు అమలు చేశారో అంతుచిక్కడం లేదు.

అసలేం జరిగింది?

1958 కంటే ముందు నవాబ్‌ మొయినుద్దీన్‌ బహదూర్‌ కూతురు సహబ్జాది సుల్తాన్‌ జహాన్ బేగం, నవాబ్‌ జహిర్‌యార్‌ జంగ్‌ బహదూర్‌ తదితరుల మధ్య హైకోర్టులో కేసు నడిచింది. సి.ఎస్‌.నెం.7/1958(అప్లికేషన్‌ నెంబర్లు 126, 129, 130, 131, 133) కింద ప్రిలిమినరీ డిక్రీని ఓ వర్గం పొందింది. దాంట్లో భాగంగా బహదూర్‌పురాలో ఇమ్లీమహల్‌ గార్డెన్‌, అమ్జాద్‌ ఉద్‌ దావ్లా గార్డెన్‌, బొల్లారం, టోలీచౌక్‌, ఆసిఫ్‌నగర్‌, బాగ్‌అంబర్‌పేట, శంషాబాద్‌, లాలాగూడ, శివరాంపల్లి, బాలాపూర్‌, రాయదుర్గం, సోమాజిగూడ, అమ్జాద్‌నగర్‌, సంఘిగూడ, అలీసాహెబ్‌, ఎల్లమ్మకుంట, ఎర్రవాడ, శంషీగూడ, రాయసముద్రం, రోషన్‌దౌలా, మూసారాంబాగ్‌ భూములపై హక్కులు సంపాదించారు.

ఐతే అంతకు ముందే రికార్డుల్లో పొరంబోకు-సర్కారీగా ఉంది. ఇరువర్గాల మధ్య ఓ ప్రభుత్వ భూమిపై పోరాటం సాగించడం గమనార్హం. ఈ కేసుల్లో ప్రభుత్వాన్ని అంటే రెవెన్యూకు చెందిన తహశీల్దార్‌/కలెక్టర్‌/ప్రిన్సిపల్‌ సెక్రటరీని పార్టీగా చేయలేదు. కేవలం రెండు ప్రైవేటు వర్గాలు లేదా ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌గానే వివాదంగానే కొనసాగినట్లు తాజాగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొన్ని కేసుల్లో ఏ సంబంధం లేని ఫైనాన్స్‌ సెక్రటరీని పార్టీగా చూపినట్లు తెలిసింది.

అక్రమంగా మ్యుటేషన్లు

జాగీర్దార్‌ భూములకు సంబంధించిన సీఎస్ 14/1958, 7/1958ల ద్వారా పొందిన ప్రిలిమినరీ డిక్రీ ఆధారంగా కొందరికి మ్యుటేషన్లు చేశారు. ఒకరికి ఐదెకరాలు, మరొకరికి ఏడెకరాలు మ్యుటేషన్‌ చేస్తూ ఫైల్‌ నెం.బి/816/2012 తేదీ.6-6-2012, బి/791/2012, తేదీ.22-6-2012లను జారీ చేశారు. శంషీగూడ సర్వే నెం.57లోని భూములన్నీ అత్యంత వివాదాస్పదమని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్ సైట్ లో కనిపిస్తుంది. సదరు భూములు నిషేధిత జాబితా (పీఓబీ 20ఏ)లో ఉన్నాయి. కానీ వందలాది క్రయ విక్రయాలు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. వివాదాస్పద భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి కొందరు రూ.కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

వెలిసిన కాలనీలు

జాగీర్దార్లు/హక్కుదారులు ప్రిలిమినరీ డిక్రీ ద్వారా కోటలు, ప్యాలెస్ లు, తోటలు, ఇండ్లు, మల్గీలు, భూములు, జాగీర్లు తమవంటూ కోర్టు నుంచి 1959లో ప్రిలిమినరీ డిక్రీని పొందారు. ఆ తర్వాత సరిహద్దులు, విస్తీర్ణం గుర్తించడం, రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించడం చేయలేదు. ఆ ప్రక్రియ పూర్తి చేస్తేనే ఫైనల్‌ డిక్రీ పొందినట్లని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారు. శంషీగూడ భూముల్లో డిక్రీ పొందిన 50 ఏళ్ల తర్వాత తాము యజమానులమంటూ కొందరు ముందుకొచ్చారు. అయితే ఫైనల్‌ డిక్రీని పొందేందుకు మాత్రం కనీస ప్రయత్నం చేయలేదు. ఈ లోగా ప్రభుత్వం ఆ భూములను ప్రజాప్రయోజనాల కోసం వినియోగించింది.

పేదలకు పట్టాలు ఇచ్చింది. ఎన్టీఆర్‌నగర్‌, దత్తాత్రేయకాలనీ, పీజేఆర్‌నగర్‌, తంగరాజుబస్తీ, ఎల్లమ్మబండ, జన్మభూమికాలనీ, ఇంద్రానగర్‌, సాయిచరణ్‌కాలనీ, మహంకాళినగర్‌, ఇంద్రాహిల్స్‌, శివాజీనగర్‌, ఆశయ్యనగర్‌, ఆదర్శనగర్‌, శ్రీరాంనగర్‌కాలనీ, కృష్ణవేణినగర్‌, మొగులమ్మబస్తీ, కమలమ్మబస్తీ, శివమ్మబస్తీ, అంబేద్కర్‌నగర్‌ వంటి అనేకం ఏర్పడ్డాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద ఇండ్లు నిర్మించారు. ప్రభుత్వం దీంట్లో నుంచి 100 ఎకరాలకు పైగానే హుడాకు కేటాయిస్తే లేఅవుట్లు చేసి విక్రయించింది. 2000 సంవత్సరం తర్వాత హక్కుదారుల నుంచి తాము కొన్నామంటూ కొందరు వస్తున్నారు. ఖాళీగా ఉన్న 100 ఎకరాలపై హక్కులు సంపాదించుకునేందుకు అవిరాళంగా కృషి చేస్తున్నారు.

Next Story

Most Viewed