వాటికి గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే !

by  |
వాటికి గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే !
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ తర్వాత వ్యాపారం ప్రారంభిస్తున్న వాహన షోరూముల యాజమానులు కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు సూచించారు. షోరూములకు వచ్చే వినియోగదారులతో పాటు యాజమానులు, సిబ్బంది అందరూ భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిప్రాంతాల్లో వాహన విక్రయ షోరూములు, వాహన విడిభాగాలు అమ్మే షాపులు తెరిచేందుకు సర్కారు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చినందున షోరూముల యాజమానులకు, సిబ్బందికి, వినియోగదారులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పాటు రాజధాని హైదరాబాద్‌లో అయితే జీహెచ్ఎంసీ, జిల్లాల్లో అక్కడి యంత్రాంగం సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాల్సిన అవసరముందని గుర్తుచేశారు. షోరూములు, విడిభాగాలు అమ్మే దుకాణాల వద్ద అందరూ శానిటైజర్స్, మాస్కులను తప్పని సరిగా వాడాలని ఆయన కోరారు. ఇందుకు ఆయా షాపుల యజమానులు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని సూచించారు. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించిన అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటూ సేవలు అందిస్తున్నామని తెలిపారు.

Next Story