వ్యవసాయ రంగంలో సంస్కరణలు కీలకం

by  |
వ్యవసాయ రంగంలో సంస్కరణలు కీలకం
X

దిశ, న్యూస్ బ్యూరో
“జనాభాలో ఎక్కువ శాతం వ్యవసాయం మీదే ఆధారంపడటం ప్రగతికి సంకేతం కాదు. కావున పారిశ్రామికీకరణ జరగాలి. రాష్ట్రం వ్యవసాయ ఆధారిత పారిశ్రామికీకరణకు ఎంతో అనుకూలం.పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేట్లు కృషి జరగాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయ పరిణతి సాధించడానికి ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్గకాలిక వ్యూహాలు అమలుచేస్తుందని, ప్రపంచంతో పోటీ పడేలా పంటల సాగు జరగాలని,రాబోయే రోజుల్లో వ్యవసాయం రూపురేఖలు మారాలన్నారు. రానున్న రోజుల్లో వర్షాకాలం పంటలతోనే వ్యవసాయంలో సంస్కరణల శకం ప్రారంభం కానున్నదని, అది రాష్ట్ర వ్యవసాయానికి ఒక దశ, దిశను నిర్దేశించాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రో పరిశ్రమల అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వివిధ రంగాల నిపుణులతో ప్రగతి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో వ్యవసాయానికి ఎక్కువ అనుకూలతలు ఉన్నాయని, ఎక్కువ మంది ఈ రంగంపైనే ఆధారపడ్డారని, తెలంగాణ జీవికలో వ్యవసాయమే ప్రధానంగా ఉందని, అందువల్లే దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో రైతులకు మార్గదర్శకం చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రైతులకు కావాల్సినవి ప్రభుత్వం సమకూరుస్తూ ఉన్నదని, కనీస మద్దతు వచ్చేలా చేస్తున్నదని, ఇది మాత్రమే సరిపోదని, ఇంకా ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పండించిన పంటను యథావిధిగా మార్కెట్‌లో అమ్ముతున్నామని, కానీ ఆ పంటను వివిధ రూపాల్లో ప్రాసెసింగ్ చేసి అమ్మడం వల్ల ఎక్కువ ధర వస్తుందని, అందుకే ప్రభుత్వం పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. ఇవి పెరిగేకొద్దీ ముడిసరుకును నిత్యం అందించేలా సంఘటిత వ్యవసాయం కావాలన్నారు. అప్పుడే తెలంగాణకు బ్రాండ్‌కు ఒక ఇమేజ్ ఏర్పడుతుందని, ఫలితంగా అంతర్జాతీయ మార్కెటింగ్‌కు దోహదపడుతుందన్నారు. చివరకు పారిశ్రామిక, సేవా రంగాలు విస్తరిస్తాయన్నారు.

పంటల మార్పిడితో భూసారం పెరుగుతుంది

ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారుతున్నాయని, దానికి అనుగుణంగా మంటలు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పంటల మార్పిడి విధానం రైతులకు ఒక అలవాటుగా మారాలన్నారు. ఈ విధానాన్ని అవలంభించడంవల్ల ఎక్కువ దిగుబడి రావడం మాత్రమే కాక భూసారం పెరుగుతుందని, దీన్ని రైతులకు అర్థం చేయించాలన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాలని, రైతులకు సరైన అవగాహన లేని కారణంగా వ్యాపారుల మాటను నమ్మి విచ్చలవిడిగా వాడుతున్నారన్నారు. వీటి వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతో పాటు, ఎక్కువగా ఎరువులు వాడిన పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉండదనే అంశాన్ని వారికి తెలియజేయాలన్నారు.

పంటల సాగులో తీసుకురావాల్సిన మార్పులు, ఉత్పాదకత పెంచడం, ప్రపంచ పోటీని తట్టుకుని నిలబడేలా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు రావడం, పంటల మిగులు లేకుండా వాల్యూ ఎడిషన్ చేయడం తదితర అంశాలపై వ్యవసాయ నిపుణులు పలు సూచనలు చేశారు.రానున్న రోజుల్లో ఇలాంటి చర్చలు జరపడం ద్వారా వ్యవసాయానికి దశ, దిశ నిర్దేశమవుతుందన్నారు. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, వాటికి అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ముడి సరుకు అందించే విధంగా, పంట మొత్తం అమ్ముడుపోయేలా ఈ రంగం మారాలని కేసీఆర్ ఆకాంక్షించారు. “సాగునీరు ఉంది. పెట్టుబడి ఉంది. రైతులకు ప్రభుత్వంపై నమ్మకం ఉంది. నైపుణ్యం కలిగిన రైతాంగం ఉంది. ఏ పంటనైనా పండించే నేలలు ఉన్నాయి. ఇన్ని సానుకూలతలు ఉన్న తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అగ్రి బిజనెస్, అగ్రి ఇండస్ట్రీ వృద్ధి జరగాలి” అని సీఎం స్పష్టం చేశారు.



Next Story

Most Viewed