గ్రేటర్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు

by  |
గ్రేటర్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ శాఖలు నిరాడంబ‌రంగా వేడుకలను నిర్వహించాయి. వేడుకల్లో భాగంగా పోలీసుల నుంచి మేయర్, కమిషనర్ లోకేష్ కుమార్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసియుద్దీన్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమిషనర్లు పాల్గొన్నారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) కమిషనర్​ అర్వింద్​ కుమార్​ తార్నాక హెచ్ఎండిఏ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హెచ్ఎండీఏ సమర్థవంతంగా పనిచేస్తే హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ సిటీగా మార్చవచ్చని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో హెచ్ఎండిఏ సెక్రెటరీ ఎం.రాంకిషన్, హెచ్​జిసిఎల్​ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ సంతోష్​, అర్బన్​ ఫారెస్ట్రీ డైరెక్టర్​ బి.శ్రీనివాస్​, చీఫ్​ ఇంజనీర్​ బీఎల్‌ఎన్ రెడ్డి, ప్లానింగ్​ డైరెక్టర్లు జి.నరేంద్ర​, కె.శ్రీనివాస్​, చీఫ్​ అకౌంట్స్​ ఆఫీసర్​ వి.శరత్​ చంద్ర హాజరయ్యారు.

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎండీ ఎం. దానకిషోర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జలమండలి అధికారులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దానకిషోర్ మాట్లాడుతూ ఈ వేసవిలో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు, నీటి కొరత లేకుండా మంచినీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. వర్షాకాలంలో మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవి, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవనాయుడు, ప్రాజెక్టు-2 డైరెక్టర్ డి. శ్రీధర్ బాబు, టెక్నికల్ డైరెక్టర్ వి. ఎల్. ప్రవీణ్ కుమార్, జలమండలి గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్ పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌లో హెచ్ఎంఆర్‌ఎల్ ఎన్వీఎస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మెట్రో ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు రాష్ట్రవతరణ శుభాకాంక్షలు తెలిపారు.



Next Story