కరోనా పేరుతో దోచుకుంటున్నారు

by  |
కరోనా పేరుతో దోచుకుంటున్నారు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం ప్రైవేట్​ఆస్పత్రుల లాభాపేక్షకు సామాన్యుడి జేబులు గుల్లవుతున్నాయి. ఇష్టారాజ్యంగా ప్రైవేట్​ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి అందినకాడికి దండుకుంటున్నారు. అనుమతులు లేకున్నా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రీట్‌మెంట్​పేరిట రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ప్రైవేట్​ఆస్పత్రులు, ల్యా‌బ్‌లకు కాసుల పంటగా మారింది. కరోనా బూచితో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. కొన్ని ప్రైవేట్​ల్యాబ్​నిర్వాహకులు ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలితే హోంక్వారంటైన్‌లోనే చికిత్స అందిస్తున్నారు. రోగుల వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో ప్రభుత్వ అధికారిక లెక్కల్లోకి కొవిడ్​కేసులు నమోదు కావడం లేదు.

నగరంలో కరోనా కేసులు రికార్డుల్లోకి ఎక్కడం లేదనే వాదనలు వినబడుతున్నాయి. ఏడాది క్రితం కరోనా మొదలైన సమయంలో గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రులను కొవిడ్ రోగులకు చికిత్సలు అందించేందుకు ప్రత్యేక హాస్పిటల్స్‌గా ప్రభుత్వం మార్చింది. అనంతరం కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఉస్మానియా, గచ్చిబౌలిలోని టిమ్స్, నిలోఫర్, నిమ్స్ లో కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహించింది. ఇవికూడా సరిపోకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షల కోసం అనుమతినిచ్చంది. కొన్ని రోజులుగా వేసవి ఎండలు మండుతున్నా కరోనా కేసులు తగ్గడం లేదు. చలికాలంలో కంటే కేసుల సంఖ్య కొంత మేర అధికంగానే నమోదవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి అంతకంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్‌లపై కొరవడిన నిఘా..

కొవిడ్ కేసుల కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. నానాటికి పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ లకు అనుమతినిచ్చింది. ప్రభుత్వం ఆశించినట్లుగా కేసులు నియంత్రణ లోకి రాకపోగా ఈ నిర్ణయం వారికి కాసులు కురిపిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నా, లేకున్నా ఇష్టారాజ్యంగా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కరోనా భయాన్ని బూచిగా చూపి రూ.లక్షల్లో దండుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కొవిడ్ పరీక్షలకు అనుమతులు లేకున్నా రోగిని చేర్చుకుని రూ.లక్షలు దండుకుని మోసం చేశారని ఓ న్యాయవాది హై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

ఇంటి వద్దనే పరీక్షలు..

జ్వరం, దగ్గు, జలుబు వంటి కొవిడ్ లక్షణాలున్న వారు ప్రైవేట్​ల్యాబ్ లకు ఫోన్ చేస్తే టెక్నీషియన్లు ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా చేసిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా వారిని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించకపోవడంతో ల్యాబ్ ల నిర్వాహ‌కులు చెప్పిన మందులు వాడుతూ ఇంటివ‌ద్దనే క్వారంటైన్ లో ఉంటున్నారు. ఇలా కొంత మంది రోగులకు న‌య‌మవుతుండ‌గా, మ‌రికొంత మంది ప‌రిస్థితి విష‌మిస్తోంది. చివ‌రి నిమిషంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి రూ.ల‌క్షల్లో బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో న‌మోదవుతున్న పాజిటివ్ కేసుల వివరాలు యాజమాన్యాలు ప్రభుత్వానికి చెప్పకపోవడంతో అధికారిక లెక్కల్లో నమోదవ్వడం లేదు. కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారి నుండి నామూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన రోగిని సైతం నెగిటివ్ గా ప్రభుత్వానికి లెక్కలు చూపిస్తూ వారిని హాస్పిటల్ లో చేర్చుకుని వైద్యం అందించి లక్షలాది రూపాయలు ఫీజుల కింద వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా చాపకింద నీరులో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

చర్యలు తీసుకోవాలి..

కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి లెక్క చూపని ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్ పై చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. కేవలం లాభార్జనే ధ్యేయంగా ప్రైవేట్​ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి రోగుల విషయంలో పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్తులు, బంగారం కుదువబెట్టి, విక్రయించి, అప్పులు తెచ్చి వైద్యం కోసం ఖర్చు పెడుతున్నారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యులు రోగి పరిస్థితి విషమంగా లేనప్పటికీ పరిస్థితి చేయిదాటి పోతుందని, వెంటనే వైద్యం అందించాలని బంధువులకు సూచిస్తూ వారిని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు వెళ్లకుండా చేస్తూ ఠాగూర్ సినిమా సన్నివేశాలను రిపీట్​చేస్తున్నారు. ఇలా రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్స్, ల్యాబ్ లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు .

Next Story

Most Viewed