తుది దశకు చేరిన మండలి పోరు.. విజేతలెవరు..?

by  |
తుది దశకు చేరిన మండలి పోరు.. విజేతలెవరు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి పోరు తుది దశకు చేరింది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలే అయినప్పటికీ రాష్ట్రంలోని 77 అసెంబ్లీ కాన్సిటెన్సీల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికలను పార్టీలన్నీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రచారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మగియనునంది. 14న మండలి పోలింగ్​ ఉన్న విషయం తెలిసిందే. వరంగల్​ సెగ్మెంట్​లో 71 మంది, హైదరాబాద్ స్థానంలో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల మొదటి నుంచి ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. చివరి రోజు వరకూ గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

పీఆర్సీపై ఆశలు

మండలి పోరులో అధికార పార్టీ మంత్రివర్గాన్ని మొత్తం మోహరించింది. ఆరు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 12 మంది మంత్రులు ప్రచారం చేశారు. 77 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్​ కూడా వ్యూహాలు అమలు చేశారు. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో సీఎం కేసీఆర్​ ఆఖరి అస్త్రం పీఆర్సీని బయటకు తీశారు. మంగళవారం ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి సుదీర్గంగా చర్చించారు. అనంతరం పీఆర్సీతో పాటు పదోన్నతులు, పదవీ విరమణ పెంపు, సీపీఎస్​ ఉద్యోగుల అంశాలన్నీ సీఎం ఒప్పుకున్నారని, మండలి కోడ్​ తర్వాత ప్రకటిస్తారని ఉద్యోగ నేతలతోనే ప్రకటన చేయించారు. అయితే ఇది ఎంత మేరకు ఓట్లను రాబట్టుతుందనేది కొంత ఆందోళనగానే మారింది.

బీజేపీ స్పెషల్​ టీం

బీజేపీ అనుబంధ సంఘాలతో పాటుగా సీనియర్లు ప్రచారం చేశారు. సంఘ్‌ పరివార్‌ ప్రచారం చేస్తోంది. 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని పార్టీ నియమించింది. ఆ పార్టీ మేధావుల సదస్సులను నిర్వహించడం, లాయర్లు, డాక్టర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు అర్వింద్, సోయం బాపూరావు, రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, ఇతర ముఖ్య నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. శుక్రవారం కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్, రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.

కాంగ్రెస్ నమ్మకమే అది..

కాంగ్రెస్​ ఉద్యోగాల భర్తీ అంశాన్నే ప్రధానంగా తీసుకుని అదే తమల్ని గెలిపిస్తోందని భావిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్‌తో కలిసి ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భద్రాచలం నుంచి వినూత్నంగా సైకిల్‌పై ఎన్నికల ప్రచారయాత్ర చేస్తున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నేతలంతా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.

సమస్యలపై స్వతంత్రుల ఫోకస్

ఉద్యోగాల భర్తీ, విశ్వవిద్యాలయాల సమస్యలపై స్వతంత్రులు ఫోకస్​ పెట్టారు. చాపకింద నీరులా వీరంతా ప్రచారం చేసుకున్నారు. సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డి ఇతర వామపక్షాలు, అనుబంధ సంఘాల సహకారంతో ఆ మూడు పార్టీలకు దీటుగానే ప్రచారం చేశారు. ప్రొఫెసర్లు ఎం.కోదండరాం, కె.నాగేశ్వర్‌తో పాటు చెరుకు సుధాకర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్​రెడ్డి, సూదగాని హరిశంకర్‌గౌడ్, రాణీ రుద్రమ, గౌరీ సతీశ్‌తదితరులు ప్రచారం చేశారు. మండలి ప్రచారపర్వం నేటితో ముగుస్తున్న నేపథ్యంలో వ్యూహాలను మరింత పదునెక్కిస్తున్నారు. పట్టభద్రులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story

Most Viewed