లాఠీ ఎత్తలేదు కానీ, తెలంగాణలో పకడ్బందీ చర్యలు

by  |
Lockdown2
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో పోలీసులు ఆంక్షలను కఠినం చేశారు. శనివారం కొన్ని చోట్ల పోలీసులు లాఠీలు ఝళిపించి విమర్శలు మూటగట్టుకోవడంతో ఆదివారం కఠినంగా లేకపోయినా నిబంధనలను మాత్రం పకడ్బందీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల దగ్గరే ఆపివేశారు. జిల్లాకొకచోట మాత్రమే చెక్‌పోస్టుల్ని తెరిచారు. మిగిలినవాటిని లాక్‌డౌన్ ముగిసేంత వరకు క్లోజ్ చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ-పాస్ ఉన్న వాహనాలతో పాటు ఎమర్జెన్సీ, మెడికల్, అంబులెన్సులను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విధిగా తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఈ-పాస్ తీసుకోవాల్సిందేనని, ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను రూపొందించామని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. వెబ్‌సైట్ శనివారం మొరాయించినా అర్ధరాత్రి నుంచి పనిచేస్తూనే ఉన్నదని ట్విట్టర్ ద్వారా వివరించారు. ఈ-పాస్ లేకుండా రాష్ట్రంలోకి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు కలిగిన రామాపురం, మఠంపల్లి, పులిచింతల చెక్‌పోస్టులను పూర్తిగా మూసివేసిన పోలీసులు కేవలం కోదాడ దగ్గర మాత్రమే ఓపెన్ చేశారు. ఖమ్మం జిల్లాలోనూ అదే విధానం అమలవుతోంది. ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గర పరిస్థితిని స్వయంగా రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెళ్ళి పరిశీలించారు.

పోలీసులతో వాదనలు..

ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలను సరిహద్దు దగ్గరే ఆపివేయడంతో ఆ వాహనాల్లోనివారు పోలీసులతో వాదనకు దిగారు. తెలంగాణలో లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ ఆంక్షలు మాత్రం ఆ సమయానికి మాత్రమే వర్తిస్తాయని, సడలింపుల సమయంలో వర్తించవని పోలీసులను ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రంలోకి రావాలంటే ఏ సమయంలోనైనా ఈ-పాస్ ఉండాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. తీవ్ర స్థాయిలో వాదనలు జరిగిన తర్వాత పరిస్థితిని, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని వాహనాలను మాత్రం తెలంగాణలోకి అనుమతించారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చే వాహనాలను గరికపాడు చెక్ పోస్టు దగ్గరే తెలంగాణ పోలీసులు ఆపివేశారు.

ఔటర్ రింగు రోడ్డు మీదుగా గూడ్సు వాహనాలు

తెలంగాణలోకి ప్రవేశించే, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలు విధిగా ఔటర్ రింగు రోడ్డునే వినియోగించుకోవాలని, నగరంలోకి రాకూడదని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. నగరంలోకి రావాల్సిన సరుకు రవాణా వాహనాలు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మాత్రమే రావాలని స్పష్టం చేశారు. అప్పటివరకూ జాతీయ రహదారుల మీదనే ఆగిపోవాలని తెలిపారు. లోడింగ్, అన్‌లోడింగ్ కార్యకలాపాలు రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల మధ్యలోనే జరగాలని, నగరం లోపలి రోడ్లమీదకు ఆ సమయంలో మాత్రమే రావడానికి వీలు ఉంటుందని స్పష్టం చేశారు.


Next Story