తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

by  |
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల్లో మొదటి పది స్థానాలను అబ్బాయిలే కైవసం చేసుకున్నారు. 75.29 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జేఎన్‌టీయూ ఇన్‌చార్జి వీసి నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, కన్వీనర్ గోవర్ధన్ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పలు పరీక్షల్లో అమ్మాయిలు ఆధిక్యత ప్రదర్శిస్తూ వస్తున్నారని, కొన్నిసార్లు సమాన స్థాయిలో పోటీ పడుతుండగా.. ఈ పరీక్షల్లో మొదటి పది స్థానాలను అబ్బాయిలే సొంతం చేసుకున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.

కరోనా పరిస్థితుల్లోనూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులకు, అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. అఫిలియేషన్ కళాశాలల వివరాలు రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇన్‌చార్జీ వీసీ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇంజనీరింగ్ విభాగం కోసం 1,43,326 మంది దరఖాస్తులు చేసుకోగా రెండు రాష్ట్రాల్లో కలిపి 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,19,183 మంది పరీక్షకు హాజరుకాగా 89, 734 ( 75.29%) మంది అర్హత సాధించారు.

8న మరోసారి ఎంసెట్

కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మరోసారి ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 84మంది కరోనా పాజిటివ్ విద్యార్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు జేఎన్‌టీయూ అధికారులు తెలిపారు. గతంలో కరోనాతో రాయలేకపోయిన విద్యార్థులకు ఈనెల 8న పరీక్ష నిర్వహించనున్నారు. ఎల్‌బీనగర్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని నవీన్ మిట్టల్ తెలిపారు.

ఇంజనీరింగ్‌లో టాప్ 10 ర్యాంకర్లు

1. సాయితేజ వారణాసి
2. కె. యశ్వంత్‌ సాయి
3. టి. మణివెంకట కృష్ణ
4. చాగరి కౌశల్ కుమార్ రెడ్డి
5. హార్దిక్‌ రాజ్ పాల్
6. నాగెల్లి నితిన్ సాయి
7. ఈ.డి.ఎన్.వి.ఎస్‌. కృష్ణ కమల్
8. ఎ. సాయి వర్ధన్
9. వి. సాయి పవన్ హర్షవర్ధన్
10. వారణాసి వచన్ సిద్దార్థ్



Next Story

Most Viewed