వాటికి గండిపడితే ఒక్క ఊరూ మిగలదు : ఉత్తమ్

by  |
వాటికి గండిపడితే ఒక్క ఊరూ మిగలదు : ఉత్తమ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో పలు ప్రాజెక్టుల కాలువలకు గండి పడి గ్రామాల్లోకి నీళ్లు ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. కొండపోచమ్మ సాగర్ కాలువకు వెంకటాపురం వద్ద గండిపడడంతో గ్రామంలోకి భారీగా వరద నీరు వస్తోంది. అటు సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ సమీపంలోని మరో కాలువకు కూడా గండి పడింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో అవినీతి కట్టలు తెగుతున్నాయని విమర్శించారు. నిన్న మిడ్ మానేరు, మొన్న కొండపోచమ్మ కాలువ, ఇవాళ సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కు పోయే కాలువకు గండ్లు పడ్డాయని వెల్లడించారు.

ఇవి అవినీతి కట్టలు, కమీషన్ల కాలువలు అని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, చిన్నప్రవాహానికే కాలువలు కొట్టుకుపోతే, వరదలు వస్తే ఊళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రారంభించి నెల కూడా కాలేదు, రెండు ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే, ఆయన ఫార్మ్ హౌస్‌కు పోయే కాలువ పనుల్లోనే నాణ్యత ఇంత ఘోరంగా ఉంటే, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో జరిగిన కాలువలు, జలాశయాల పనుల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఈ నష్టం మొత్తం కాంట్రాక్టర్లు భరించాలని స్పష్టం చేశారు.

కాలువలకు గండ్లు పడితేనే గ్రామాల్లోకి వరదలు వస్తుంటే, జలాశయాలకు గండి పడితే ఒక్క ఊరు కూడా మిగలదని స్పష్టం చేశారు. వాటి పరిధిలో ఉన్న గ్రామాలన్నీ జలవలయంలో కొట్టుకుపోతాయని హెచ్చరించారు. లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ పనులపై సీబీఐ విచారణకు ఆదేశించి, అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed