దళితబంధుపై అనేక అనుమానాలు.. ఇదైనా అమలు చేస్తారా?

by  |
దళితబంధుపై అనేక అనుమానాలు.. ఇదైనా అమలు చేస్తారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం లాంఛనంగా ఏర్పడక ముందు నుంచే దళితుల అభివృద్ధిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో రకరకాల హామీలు ఇచ్చారు. వాటి అమలుపై విపక్షాల నుంచి, దళిత ప్రజా సంఘాల నేతల నుంచి విమర్శలూ వచ్చాయి. తాజాగా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ‘దళిత బంధు’పథకంపై సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2021-22)లో ‘దళిత సాధికారత ‘కోసం వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు దాన్ని రూ. 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితుల కోసం సీఎం హోదాలో కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలపై ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ లోపలా, బయటా ప్రశ్నిస్తూనే ఉన్నారు. హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం ఆయనకు అలవాటేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దళిత ద్రోహి అంటూ కాంగ్రెస్ నేతలూ విమర్శించారు.

గతంలో కేసీఆర్ ఇచ్చిన పలు హామీల అమలు గురించి పట్టించుకోలేదని గుర్తుచేశారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని, భూమి లేని దళితులకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తామని చెప్పి వాటిని గాలికొదిలేశారని ఉదహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మూడు రోజుల క్రితం తెలంగాణ భవన్‌లో కౌశిక్ రెడ్డిని చేర్చుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. “హుజూరాబాద్‌లో ఎలక్షన్ ఉందని దళిత బంధు పెట్టారంటూ విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోసమే పెట్టారని అంటున్నారు. ఎన్నికలంటే పెట్టమా మరి! ఎందుకు పెట్టం? టీఆర్ఎస్ ఏమన్నా సన్నాసుల మఠమా? డెఫినెట్‌గా ఇది రాజకీయ పార్టే. కచ్చితంగా స్కీం పెడితే రాజకీయ లాభం కోరుకుంటాం. అధికారంలో ఉన్నాం కాబట్టి పెడతాం. ఈ స్కీమ్‌ను ఏడనో ఒక చోట పెట్టాల్సిందే. రైతుబంధు లాగానే ఇప్పుడు హుజూరాబాద్‌లోనే దళితబంధును పెడుతున్నం’ అని వ్యాఖ్యానించారు.

నేడు 412 మంది దళిత ప్రతినిధులతో సమావేశం

ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితులతో ప్రగతి భవన్‌లో సోమవారం మీటింగ్‌ను పెట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఇదే విషయాన్ని ఆ నియోజకవర్గానికి చెందిన ఒక మహిళా ఎంపీటీసీ భర్తకు కేసీఆర్ స్వయంగా ఫోన్‌ చేసి వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా వారిని అక్కడి నుంచి హైదరాబాద్ తరలించడానికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. ఇంతకాలం దళితులపై చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలు, వాటి అమలు ఎలా ఉన్నా.. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ‘దళితబంధు’ గురించి చకచకా జరుగుతున్న పనులు, చేస్తున్న ప్రకటనలు ఆసక్తికరంగా మారాయి. “సీఎం హామీ ఇస్తే దానిని అమలు చేయాల్సిందే. లేదంటే ప్రజలు కోర్టును ఆశ్రయించవచ్చు. అమలు కుదరదంటే ప్రభుత్వమే కారణం చెప్పాలి. నిర్ణయాన్ని ప్రకటించకుండా నాన్చడం కుదరదు’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో ఇచ్చిన హామీలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. ఇప్పుడు ‘దళితబంధు’ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న హామీలు, చేస్తున్న వ్యాఖ్యల సమయంలో ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును దళిత సంఘాలు పోల్చి చూస్తున్నాయి.

గతంలో కేసీఆర్ చేసిన ప్రకటనలు

“కేసీఆర్‌కు పదవులు అవసరం లేదు. నేను కాపలా కుక్కలాగ ఉంటా. ఒక్కసారి చెప్పలే. వందసార్లు చెప్పిన. మళ్ళీ మళ్లీ చెప్తా ఉన్న. రేపు తెలంగాణ రాష్ట్రానికి కచ్చితంగా ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటడు. ఆ దళిత నాయకుడి ఆధ్వర్యంలోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చేసుకుని తీరతం అని చెప్తా ఉన్న’’
– 2013 జూన్ 3న నిజాం కాలేజీ గ్రౌండ్స్ బహిరంగసభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

“ఒక దళిత నాయకుడినే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి కేసీఆర్ ప్రకటించిండు. నేను చెప్పిన్నంటే తల నరుక్కుంట గానీ మాట తప్పను. కచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటడు“
– 2014 ఏప్రిల్ 26న వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సభలో కేసీఆర్.

“రానున్న ఐదేళ్లలో దళితుల కోసం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, లెక్కలు తీసి .. ఊరికే ఆషామాషీగా కాంగ్రెస్ చెప్పినట్లు కాదు.. దళితుల అభివృద్ధి కోసం రూ. 50 వేల కోట్లను ఖర్చు చేయబోతా ఉన్నాం. ఇది కేసీఆర్ మాట. ఇప్పుడున్న పది జిల్లాలను లెక్క పెట్టుకుంటే ఒక్కో జిల్లాకు రూ. 5,000 కోట్లు ఖర్చయితయి”
– 2014 మార్చి 24న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

‘‘రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2019 మార్చి చివరి నాటికి ఐదేళ్ల కాలంలో ఎస్సీ ప్రజల అభివృద్ధి కోసం రూ. 33,854 కోట్లను ఖర్చు చేశాం. రాష్ట్రంలోని మొత్తం సంక్షేమ బడ్జెట్‌లో ఇది 15.45%. మరింత ఫోకస్డ్ పద్ధతిలో ఎస్సీల అభివృద్ధి కోసం నిధులను ఖర్చు చేయడానికి 2017లో సబ్ ప్లాన్ చట్టం తీసుకొచ్చాం”
– 2021 జూన్ 26న దళిత ప్రతినిధుల సమావేశంలో ఇచ్చిన వివరాల్లో సీఎం కేసీఆర్.

.
“మొత్తమే భూమి లేనోళ్లకు మూడు ఎకరాలు కొనమన్నం. ఇప్పుడు ఎకరం ఉన్నోళ్లకు రెండు ఎకరాలు కొనమంటం. రెండున్నోళ్ళకు మూడు చేయమంటం. రెండున్నరోళ్ళకు ఇంకో అర ఎకరం కొని మూడు చేయమంటం. వీలైనంత ఎక్కువ దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఉండాలన్నది ప్రభుత్వ సదాశయం. ఎన్ని అప్లికేషన్లు తెచ్చి ఇచ్చినా మేం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నం. మాకు చిత్తశుద్ధి ఉన్నది. టాప్ ప్రయారిటీలో దళిత కుటుంబాల సముద్ధరణ జరుగుతుంది”
– 2015 మార్చి 17న తెలంగాణ అసెంబ్లీలో సీఎం హోదాలో కేసీఆర్.

“భవిష్యత్తులో ఏదో భూమి పంచబోతం అని చెప్పం. ఇక లేదధ్యక్షా. వట్టి సంచి కాడ కొట్లాడం. ఖజానాలో ఉంటే గదా పంచేది? భూములేదో పంచుతమని ఇంతకు ముందు చెప్పినట్లు, పార్టీలు చెప్పినట్లు అబద్ధాలు చెప్పం అధ్యక్షా. ఫాల్స్ ప్రాపగాండా చేసి ఓట్లప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పే ఆ అలవాటు మా పార్టీకి లేదు అధ్యక్షా. మేము సత్యాలే చెబుతాం. ఉన్నది ఉన్నట్లు చెప్తాం. పంచడానికి ప్రభుత్వ భూములు లేవు. మల్లు భట్టి విక్రమార్కగారు మేమేదో భూములు పంచబోతున్నట్లు చెప్పారు. అది లేదు”
– 2020 సెప్టెంబరు 11న అసెంబ్లీలో సీఎం కేసీఆర్.

ఎస్సీ వర్గీకరణపై
“వర్గీకరణ పోరాటం మంద కృష్ణ మాదిగతో కాదు. ఆయన పనైపోయింది. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వర్గీకరణ చెయ్యబోమని స్వయంగా చెప్పారు. నేను తెలంగాణ మాదిగ బిడ్డలకు ఒకటే హామీ ఇస్తా ఉన్న. ఎవ్రీ డే ఈజ్ నాట్ మండే.. నాట్ సండే. మీ దినం కూడా వస్తది. మీ ఎంబడి కేసీఆర్ ఉంటడు. వంద శాతం ఆ వర్గీకరణను నేను సాధించి చూపిస్త. నాకు వదిలిపెట్టండి. వర్గీకరణ తెచ్చిచ్చే పోరాటం చేస్తా అని మీకు హామీ ఇస్తున్న
“– 2018 మార్చి 14న అసెంబ్లీలో సీఎం కేసీఆర్.


Next Story