ఒక్క నెలలో ఆరున్నర వేల కోట్లు

by  |
ఒక్క నెలలో ఆరున్నర వేల కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలైన సమయంలో తీసుకున్న అప్పుకంటే ఈసారి ఒక్క జూన్ నెలలో తీసుకున్న రుణమే ఎక్కువగా ఉంది. ఈ నెల 1, 8 తేదీల్లో మూడున్నర వేల కోట్ల రూపాయలను రిజర్వు బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్‌మెంట్ లోన్ పేరుతో అప్పుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మంగళవారం మరో మూడు వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకోనున్నది. ఇక ఈ నెల 22, 29 తేదీల్లో సైతం మరికొంత తీసుకోడానికి ప్లాన్ చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ. 8,000 కోట్లు మాత్రమే రుణంగా తీసుకోవాలని ఇండికేటివ్ క్యాలెండర్‌లో రిజర్వు బ్యాంకుకు సమాచారం ఇచ్చింది. కానీ ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి ఇప్పటికే రూ. 8,500 కోట్లను తీసుకున్నది. ప్లాన్ చేసుకున్నదానికంటే ఎక్కువగా తీసుకున్నది. మంగళవారం కూడా రూ. 3,000 కోట్లు తీసుకున్నట్లయితే ఈ త్రైమాసికంలో తీసుకున్న రుణం రూ. 11,500 కోట్లకు చేరుకుంటుంది.

రైతుబంధు పథకం కోసం ఈ నెలలో రూ. 7,508 కోట్లను విడుదల చేయాల్సి ఉన్నందున స్వంత ఆర్థిక వనరులకు తోడుగా ఈ అప్పుల ద్వారా సమకూర్చుకున్నదాన్ని వెచ్చించనున్నది. దీనికి తోడు వచ్చే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెంపు వేతనాన్ని కూడా అందించాల్సి ఉన్నందున అదనంగా మరో వెయ్యి కోట్ల రూపాయల భారం పడుతోంది. వార్షిక బడ్జెట్‌లో వేసుకున్న అంచనాలకు అనుగుణంగా పన్నుల వసూళ్ళు, ఆదాయం సమకూరక పోతుండడంతో అప్పులు అనివార్యమవుతున్నాయి. ఇది కూడా సరిపోదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ ద్వారా అమ్మకానికి పెట్టింది. దీని ద్వారా సుమారు రూ. 20 వేల కోట్లను సమకూర్చుకోవాలనుకుంటున్నది.

జీఎస్టీ, వ్యాట్ లాంటి పన్నుల ద్వారా గతేడాది కంటే సుమారు 8 వేల కోట్ల రూపాయలు ఎక్కువగా ఆర్జించినప్పటికీ ప్రస్తుత అవసరాలకు సరిపోవడంలేదని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. లాక్‌డౌన్ కారణంగా కొన్ని వారాల పాటు భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఆ మేరకు ఆదాయం తగ్గిపోయింది. ఇక రవాణా శాఖ తరపున ఆదాయం కూడా దాదాపు నెల రోజులకు పైగా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే ఆదాయం సమకూరుతున్నప్పటికీ బడ్జెట్ అంచనాలకు తగినట్లుగా రాకపోవడం, ఖర్చులను నివారించలేకపోవడంతో ఆర్థిక నిర్వహణ ఆ శాఖ అధికారులకు సవాలుగా మారింది.



Next Story

Most Viewed