ఔరా మల్లన్నా.. ఎంత పనిజేస్తివన్నా..

by  |
ఔరా మల్లన్నా.. ఎంత పనిజేస్తివన్నా..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ:నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీన్మార్ మల్లన్న హాట్ టాపిక్‌గా మారారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన 71 మంది అభ్యర్థుల్లో ఆయన ఒకరు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లన్నపై ఎన్నికల ఓట్ల లెక్కింపు ముందు వరకు ఎవ్వరికీ పెద్దగా అంచనాల్లేవు. ప్రధాన పార్టీలు సైతం ఆయన్ను పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. కనీస పోటీదారుడిగానూ పరిగణించలేదు. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలయ్యాక.. తీన్మార్ మల్లన్న సంచలనంగా మారారు. ఏ రాజకీయ పార్టీ అండ.. ఏలాంటి అంచనాలు లేకుండా.. కేవలం సోషల్ మీడియానే ప్రధాన ప్రచార అస్త్రంగా ఎమ్మెల్సీ ఎన్నికల రంగంలోకి దిగిన మల్లన్న అనుహ్య ఫలితాలతో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశారు. రౌండ్ రౌండ్‌కి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ.. అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీనిస్తూ రెండో స్థానానికి ఎగబాకాడు.

చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తుది ఫలితం వరకు గట్టి పోటీనిచ్చేలా తీన్మార్ మల్లన్న దూసుకెళుతుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో అధికార పార్టీ సైతం ఔరా.. మల్లన్నా.. ఎంత పనిజేస్తివేమయ్యా.. అనే పరిస్థితిని తీసుకొచ్చాడు. ఇంకా మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మిగిలి ఉంది. మల్లన్నకు గెలిచే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయనే చెప్పాలి. ఏదిఏమైనా.. అత్యాధునిక యుగంలో తప్పనిసరి అయిన సోషల్ మీడియాను వాడుకుని ఓ వ్యక్తి ఏకంగా చట్టసభల్లోకి అడుగుపెట్టే పరిస్థితి రావడం మాములు విషయమేమీ కాదు.

Next Story

Most Viewed