ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దు

by  |
ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దు
X

దిశ, స్పోర్ట్స్: బోర్డర్-గవాస్కర్ సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా మరో సిరీస్‌పై కన్నేసింది. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించడమే కాకుండా, గబ్బాలో చారిత్రిక విజయాన్ని అందుకొన్న ఇండియా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనపడుతన్నది. విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరటం.. అనుభవం ఉన్న ఇషాంత్ శర్మ గాయం నుంచి కోలుకోవడంతో పాటు స్వదేశంలో సిరీస్ ఆడుతుండటంతో టీమ్ ఇండియానే హాట్ ఫేవరెట్లుగా కనపడుతున్నారు. అయితే టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం కావొద్దని విశ్లేషకులు అంటున్నారు. కరోనా తర్వాత క్రికెట్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు వరుసగా వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లను స్వదేశంలో ఓడించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ గెలిచింది. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు 2-0తో క్లీన్ స్వీప్ చేసి మంచి ఫామ్‌లో ఉన్నది. ఇండియాకు స్వదేశంలో ఆడే బలమున్నా.. ఇంగ్లాండ్ జట్టుకు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని ఆడే ఆటగాళ్లు ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ జట్టును తక్కువగా అంచనా వేయొద్దని విశ్లేషకులు భావిస్తున్నారు.

బ్యాటింగే బలం..

ఇంగ్లాండ్ జట్టులో అద్భుతమైన బ్యాట్స్‌మాన్ ఉన్నారు. ప్రత్యేకించి టెస్టు మ్యాచ్‌ల కోసమే కొందరు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కెప్టెన్ జో రూట్, జాస్ బట్లర్, జాక్ క్రాలీ, డొమినిక్ సిబ్లే వంటి బ్యాట్స్‌మెన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కంటే సుదీర్ఘ ఫార్మాట్లో మంచి రికార్డు కలిగి ఉన్నారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో జో రూట్ ఒక డబుల్ సెంచరీతో పాటు మరో సెంచరీ నమోదు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక జాస్ బట్లర్ ఎంతో నిలకడైన బ్యాట్స్‌మాన్. ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్న అనుభవం అతడికి ఉన్నది. టాప్ ఆర్డర్ ఒక వేళ విఫలమైనా ఆదుకోవడానికి మిడిల్ ఆర్డర్‌లో బెన్ స్టోక్స్ ఉన్నాడు. అతడికి ఇండియా పిచ్‌లు సుపరిచితమే. బ్యాట్‌తోనే కాకుండా బంతితో కూడా రాణించే సత్తా ఉన్న ఆల్‌రౌండర్. ఇక మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్‌లు కూడా బ్యాటుతో పరుగులు రాబట్టగలరు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చాలా లోతుగా ఉండటంతో వారిని అంత సులభంగా అవుట్ చేయలేము. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగలిగే జో రూట్.. ధాటిగా ఆడి భారీ స్కోర్ చేయగలిగే బెన్ స్టోక్స్, జాస్ బట్లర్‌ను సాధ్యమైనంత త్వరగా ఔట్ చేయగలిగితేనే ఇండియా మ్యాచ్‌పై పట్టు భిగించే అవకాశం ఉంటుంది.

పేసర్లు ఓకే.. స్పిన్నర్లే డౌట్

ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్‌లో అతిపెద్ద బలం జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్. గత కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ బౌలింగ్‌కు వీళ్లే పెద్ద దిక్కు. వయసు మీద పడుతున్న కొద్దీ వీరి బౌలింగ్‌లో పదును ఎక్కువవుతున్నది. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లు గమనిస్తే ఈ పేసర్ల ధ్వజమే ఎక్కువగా వికెట్లు తీస్తున్నది. అండర్సన్, బ్రాడ్‌లకు ఇండియాలో ఆడిన అనుభవం ఉన్నది. గత సిరీస్‌లో వీరిద్దరూ ఇండియన్ పిచ్‌లపై ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలిగారు. అయితే స్పిన్ దళంలోనే అనుభవలేమి వెంటాడుతున్నది.

మొయిన్ అలీ తప్ప మిగతా ఇద్దరికి పెద్దగా అనుభవం లేదు. భారత బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కోగలరు. డామ్ బెస్, జాల్ లీచ్ ఇద్దరి బౌలింగ్‌ను ఆడింది తక్కువ. అదొక్కటే ఇంగ్లాండ్‌కు కలసి వచ్చే అంశం. ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్‌లో వీరిద్దరూ కలసి 22 వికెట్లు పడగొట్టారు. అయితే శ్రీలంక పిచ్‌లకు ఇండియా పిచ్‌లకు కాస్త తేడా ఉంటుంది. మొయిన్ అలీకి తోడు వీళ్లు రాణిస్తే తప్ప భారత బ్యాట్స్‌మెన్‌ను ఆపగలిగే పరిస్థితి ఉండదు. మొత్తానికి బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇంగ్లాండ్ జట్టు బలంగానే కనిపిస్తున్నది. గత సిరీస్ 4-0తో ఓడిపోయామనే మైనస్ తప్ప ప్రస్తుతం జట్టులో పెద్దగా బలహీనలు కనిపించడం లేదు. కాబట్టి టీమ్ ఇండియా సరైన వ్యూహాలతో వెళ్లి ఇంగ్లాండ్‌ను నిలువరించాలని విశ్లేషకులు చెబుతున్నారు.



Next Story

Most Viewed