టీమ్ ఇండియాలో కరోనా కలకలం

by  |
టీమ్ ఇండియాలో కరోనా కలకలం
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్ ఇండియా జట్టులో కరోనా కలకలం పుట్టించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమ్ ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ 20 రోజుల సెలవులు మంజూరు చేసింది. దీంతో బయోబబుల్ దాటి క్రికెటర్లు బయట పర్యటిస్తూ సెలవులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సెలవులే క్రికెటర్ల పాలిట శాపంగా మారాయి. టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడు. అతడికి కరోనా డెల్టా వేరియంట్ సోకినట్లు సమాచారం. 8 రోజుల కిందటే పంత్ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంలో లండన్‌లోని ఒక ప్రత్యేక ప్రదేశంలో అతడిని పూర్తిగా ఐసోలేట్ చేశారు. వెంటనే టీమ్ఇండియా సభ్యులకు, సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒక సపోర్ట్ స్టాఫ్ ఒకరికి కరోనా పాజిటివ్ తేలింది. వెంటనే అతడిని ఐసోలేట్ చేశారు. అతడితో సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురు క్రికెటర్లను క్వారంటైన్ చేశారు. మరోవైపు వృద్దిమాన్ సాహకు జులై 10న నిర్వహించిన పరీక్షలో పాజిటివ్ రాగా.. జులై 14న నెగెటివ్ వచ్చింది. అయినా సరే అతడిని ఐసోలేషన్ చేసినట్లు తెలుస్తున్నది.

సెలవులే కొంప ముంచాయి..

టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటానికి జూన్ 1న ఇంగ్లాండ్ వెళ్లింది. జూన్ 23న ఫైనల్ ముగిసిన తర్వాత అక్కడే ఉండిపోయారు. అగస్టు 4 నుంచి ఇంగ్లాండ్ పర్యటన మొదలవనున్నది. దాదాపు 40 రోజుల సమయం ఉండటంతో బీసీసీఐ 20 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. బయట తిరిగే క్రికెటర్లు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని బీసీసీఐ పదే పదే చెప్పింది. అయితే యూరో కప్ 2020లో రిషబ్ పంత్ కనిపించాడు. మాస్కులు లేకుండా.. వేలాది మంది ప్రేక్షకుల మధ్యలో పంత్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వెంటనే అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలాడు. బీసీసీఐ అతడిని ఒక ప్రత్యేక ప్రదేశంలో ఐసోలేట్ చేసింది. ప్రస్తుతం అతడికి ఎలాంటి లక్షణాలు లేవని.. పూర్తిగా కోలుకుంటున్నాడని టీమ్ యాజమాన్యం తెలిపింది. మరోవైపు సపోర్టింగ్ స్టాఫ్‌లో ఒకరైన దయానంద్ గరాని కూడా కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం దయానంద్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడితో సన్నిహితంగా మెలిగిన ముగ్గురు సహాయక సిబ్బంది కూడా క్వారంటైన్‌కు వెళ్లారు. వృద్దిమాన్ సాహ అతడితో క్లోజ్ కాంటాక్ట్‌లోకి వెళ్లడంతో అతడిని కూడా ఐసోలేట్ చేశారు. సాహాకు సన్నితంగా ఉన్న ముగ్గురు క్రికెటర్లను గతంలో క్వారంటైన్ చేశారు. కానీ ప్రస్తుతం వాళ్లకు పరీక్ష చేయగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది.

సెలవులు రద్దు..

టీమ్ ఇండియాకు జులై 17 వరకు సెలవులు ఉన్నాయి. కానీ రెండు రోజుల ముందు రద్దు చేసి సాహ, పంత్, నలుగురు సహాయక సిబ్బంది మినహా అందరినీ దుర్హం పిలిపించింది. బుధవారం సాయంత్రానికే క్రికెటర్లు దుర్హంలోని హోటల్‌కు చేరుకున్నారు. ఏ క్రికెటర్లు కూడా తదుపరి పరీక్షల ఫలితాలు వచ్చే వరకు కలుసుకోవద్దని బీసీసీఐ ఆదేశించింది. దుర్హం వేదికగా జరగాల్సిన రెండు టూర్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఈసీబీ చెప్పింది. కోహ్లీ సేనలో కరోనా కలకలంపై ఈసీబీ నిశితంగా పరిశీలిస్తున్నది. ఇటీవల ఇంగ్లాండ్‌లో పర్యటించిన శ్రీలంక ఆటగాళ్లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. అందుకే బయోబబుల్‌ను మరింత కఠినంగా మార్చాలని ఈసీబీ నిర్ణయించింది. టీమ్ ఇండియా క్రికెటర్లందరూ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని.. త్వరలోనే కరోనా బారిన పడిన వాళ్లు కోలుకొని జట్టుతో చేరతారని బీసీసీఐ చెబుతోంది. ఆటగాళ్లను జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ కార్యదర్శి వారికి లేఖ కూడా రాశారు.

Next Story

Most Viewed